OOHA CHITRAM by ARIPIRALA SATYAPRASAD Telugu book cover

OOHA CHITRAM

by ARIPIRALA SATYAPRASAD

₹120
In stock · 15 available
PublisherGNA PRACHURANALU
LanguageTelugu
నా మాట నిజం చెప్పద్దూ, మా ఇంట్లో వెనక ఏడు తరాలు చూసుకున్నా రచయితలు ఎవరూ లేరు దూరపు చుట్టాలలో సంగీతజ్ఞులు, ఇదే ఇంటిపేరుతో కొంతమంది రచయితలు వున్నా వారితో అనుబంధం తక్కువ. మరి నాలో ఈ సాహిత్యాభిలాష ఎక్కడిదా అని వెతుక్కుంటూ నాలోకి నేనే చూసుకుంటే ముందు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. గత పాతికేళ్లుగా ఆమె జ్ఞాపకంగానే మిగిలింది. పాత సినిమాపాటలో, లలిత సంగీతమో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా లేకుండా ఆమె నాకు గుర్తుకురాదు. రేడియో పాడుతుంటే, ఆమె పనులు చేసుకోవటం ఆమె గురించి గుర్తున్న సంతోషకరమైన జ్ఞాపకాలలో ఒకటి. ఇక అదే రేడియోలో ఏ రాత్రిపూటో నాన్న పెట్టే కర్ణాటక సంగీతం -తెలియకుండానే త్యాగరాజునీ, శ్యామదాసునీ, పురంధరదాసునీ పరిచయం చేసేవి. సుబ్బలక్ష్మి, శమ్మంగుడి, మహారాజపురం, కున్న కూడి, పట్టమ్మాళ్ ఇలా ఒక్కొక్కళ్లే మా గోడమీద చెక్క స్టాండ్ స్టేజి పైకి ఎక్కి టేప్ రికార్డర్ రూపేణా కచేరీలు చేస్తుండేవాళ్లు. వీళ్లంతా నాన్న సేకరించిన వందలకొద్దీ సంగీతం క్యాసెట్లలో సంగీత సామ్రాట్టులు. వీరందరి మధ్యలో అక్కడక్కడ కనిపించే నాలుగైదు సినిమా పాటల క్యాసెట్లలో నుంచి ఎ.ఎమ్.రాజా, ఘంటసాల, లీల, సుశీల గొంతు సవరించేవాళ్లు. వీళ్లంతా అమ్మకోసం నాన్న రికార్డ్ చేయిస్తే ఇంటికి వచ్చిన అతిథులు, ఈ సంగీతం, సినీగీతం మధ్యలో ఎక్కడో కళల గురించి ఆసక్తో, అభిరుచో మొదలైంది. వేమన్నని, పోతన్నని పరిచయం చేసింది మేనత్త. తొలి అడుగులు వేస్తున్నప్పటి నుంచే తెల్లవారు ఝామున లేపి, నీళ్లు పోసి, దేవతార్చనకి పూలు కోసే నెపంతో నన్ను పక్కింటికి తీసుకెళ్లి "శుక్లాంబర ధరం'తో మొదలుపెట్టి, 'ఇంతింతై వటుడింతై' అంటూ పోతనని పలకరించి, ఆ తరువాత పాడ్యమి విదియ తదియలు, ప్రభవ విభవలు చెప్పించేది. తెల్లవారుఝామున చెప్పిన పద్యాలు, చదివిన చదువులు, నందివర్ధనం చెట్టు మీద నుంచి రాలిపడిన మంచుబిందువులంత స్పష్టంగా గుర్తున్నాయి. అక్కడ తెలుగుతో పరిచయం అయ్యింది.