OOHALAKE REKKALOSTE (JANAPADA NAVALA) by NARAMSETTI UMAMAHESWARA RAO Telugu book cover

OOHALAKE REKKALOSTE (JANAPADA NAVALA)

by NARAMSETTI UMAMAHESWARA RAO

₹45
In stock · 45 available
PublisherGOTRA PRACHURANALU
LanguageTelugu
బాలల ఊహలకు రెక్కలు తొడుగుతున్న కథల నాయకుడు "పిల్లలకు బాల్యం నుండే కథలు, గేయాలు, సామెతలు, పొడుపుకథలపై ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి. అప్పుడే పిల్లలకు మాతృభాష మీద గౌరవం, ప్రేమ కలుగుతాయి. ఉత్తమ బాలసాహిత్యాన్ని పిల్లలకు చేరువ చేసినప్పుడే వారిలో నైతిక విలువలు పెరిగి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు తోడ్పడతారు. ఉత్తమ బాలసాహిత్యాన్ని అందరూ ప్రోత్సహించాలి. శ్రేష్ఠమైన బాలసాహిత్యమే నీతివంతమైన సమాజాన్ని సృష్టిస్తుంది" - అని విశ్వసించి, అందుకు నిరంతరం పరితపించి, తన కలాన్ని ఝళిపించే రచయిత 'బాలసాహితీరత్న' శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం గెడ్డలుప్పి స్వగ్రామం.. పార్వతీపురం శాశ్వత విలాసం. కీ.శే. సావిత్రమ్మ, గంగయ్యల సంతానంగా, ధర్మపత్ని అమ్మాజీ తోడుగా, పిల్లలు నివేష్, నిఖితల కలల రాజుగా వర్థిల్లడం ఒక ఎత్తైతే... తెలుగుబాలల కథల రాజుగా ఎదగడం మరొక ఎత్తు. నాలుగు దశాబ్దాలుగా రచనా ప్రపంచంలో కథల సేద్యగాడుగా జీవిస్తున్నా ఏనాడూ రాజీపడని నిష్కర్ష, కథల ప్రపంచాన్ని జయించాలనే జిగీష అతని స్వంతం. అతని మార్గం స్వచ్ఛందం. పార్వతీపురం బాలసాహిత్యానికి పెట్టింది పేరు. ఆ పేరుకు తనవంతు సాయాన్ని అందించి తృప్తిపడే సున్నితమైన కలం ఆయనిది. సుతిమెత్తని పలుకులు అతని నోటినుండైనా, కలం నుండైనా ఒకలాగే జాలువారతాయి. ఒకతీరుగానే అందరినీ ఆహ్లాదపరుస్తాయి. కథలు, కవితలు, గేయాలు, నవలలు ఏం వ్రాసినా, తను ఎన్ని పురస్కారాలు అందుకున్నా, అతని రచనలు ఎన్ని సన్మానాలకు నోచుకున్నా పిల్లలకోసం వ్రాస్తేనే అతనికి తృప్తి. బాలసాహిత్యం నిరాదరణకు గురికాకూడదంటే సమర్థులు తమ ఆత్మను నమ్ముకుని వ్రాస్తేనే ఉభయతారకమని నమ్మిన ఉత్తమశ్రేణి రచయిత శ్రీ ఉమామహేశ్వరరావు. తెలుగంటే ప్రాణం... తెలుగుభాషా పరిరక్షణ సమితి సభ్యులై వీరు చేసిన కృషి, జాతీయ తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా చేస్తున్న సేవా కొనియాడదగినవే. ఈ రచయిత ప్రచురించిన బాలల కథల పుస్తకాలు- 'మేలెరిగిన మనిషి', 'వింతజలం', 'భద్రయ్యపంపకం', 'నిజాయితీకి బహుమతి', 'నిజమైన స్నేహితుడు', 'తలతిక్కరాజు' లను పరిశీలిస్తే బాలసాహిత్యంపై ఉన్న ప్రత్యేకమైన ప్రేమ కనులకు కడుతుంది. అందుకే వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రత్యేకత ఎప్పుడూ ఒక మనిషికి చిరునామా అవుతుంది. అందుకే పెద్దల సాహితాన్ని కూడా సమాంతరంగా సృజించి, వెలయించినా శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావుకు బాలసాహిత్యం విలాసమైంది. బాలల ఊహలకు రెక్కలు తొడుగుతూ ఈ నవల ద్వారా మన ముందుకు వచ్చిన చిన్నారుల కథల మామయ్య శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావును మనమూ అభినందిద్దాం. బాలల కథల రారాజుగా అంబారీ ఎక్కిద్దాం.