OORU NIDRAPOYINDI by Y.RAGHUNADHA RAO Telugu book cover

OORU NIDRAPOYINDI

by Y.RAGHUNADHA RAO

₹100
In stock · 371 available
PublisherY.RAGHUNADHA RAO
LanguageTelugu
ఊరు నిద్రపోయింది ఆ ఉత్సవం నాటి సాయంత్రం బజారంతా క్రిక్కిరిసి ఉంది, ఎక్కడా నడవ డానికి కూడా జాగా లేదు. స్త్రీ, పురుషభేదం లేకుండా జనం ఒకరినొకరు రాసుకు తిరుగుతున్నారు. ఆకాశంలో ఉండాల్సిన ఇంద్ర ధనస్సు నేలమీద జారిపడి తునాతునకలై తన రంగులన్నిటినీ రోడ్డు మీద జల్లింది. ప్రసాదరావు తొడుక్కున్న చాకింటి చొక్కా, పంటామూ. ఆ తొక్కిడికి పూర్తిగా నలిగిపోయేయి. అతడింకా వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎదురుగా వస్తున్న ఒక పులివేషం బృందాన్ని తప్పుకుందామని రోడ్డు పక్కకి గెంతబోయి ఒక పల్లె పడుచు మీద పడ్డాడు. ఆమె కోపంగా వెనక్కి తిరిగి ప్రసాదరావు వైపు కొరకొర చూసి "ఏం పాడు బుద్ధులమ్మా!" అని ఫక్కున నవ్వి వయ్యారంగా ముందుకు సాగిపోయింది. ఆమె తలకు రాసుకున్న పచ్చినూనె అతని చెంపనంతా జిడ్డు చేసింది. జేబురుమాలుతో ఆ జిడ్డు తుడుచుకుంటూ కాసేపు ఊపిరి తీసుకోడానికి ఎక్కడైనా జాగా దొరుకుతుందేమో అన్నట్లు అతడు నాలుగు వైపులా చూసేడు. "రండి బాబూ, రండి! లక్కీఛాన్స్- లక్కీఛాన్స్! బేడకి అయిదు బేడలు-పావలాకి అయిదు పావలాలు-ఐదు రూపాయలకి పాతికా, తంత్రం లేదూ మంత్రం లేదూ. మీ చేతుల్లోనే కవర్లు తీయండి-లక్కీ ఛాన్స్, లక్కీఛాన్స్!" అని దగ్గర్లోని ఒక స్టాలులోంచి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడా జనం గుంపులుగానే ఉన్నారు. గాని తోపుడు లేదు. అంతా తనవైపు వీపులు తిప్పి ముందుకు వంగి నిల్చున్నారు. డబ్బుల శబ్దం గల గలా వినిపిస్తోంది. ప్రసాదరావు అక్కడికి నడిచి నిల్చున్న వారిలో ఇద్దరి తలల మధ్య తన తల దూర్చేడు. ఒక నలుచదరం బల్లమీద ఒకటినుంచి పదిదాకా అంకెలు పదిగళ్ళలో రాసున్నాయి. ఆ బల్లకి ఒకవైపు ఒక గళ్ళ లుంగీ, బనియనూ తొడుక్కున్న ఆసామీ ఒకడు సొమ్ము లెక్కపెడుతూ కూర్చున్నాడు. మధ్యపాపిడి, నొక్కుల జుట్టు, నోట్లో బారెడు చుట్ట ఉంది. వయసు కాస్త మీరినా శరీరంమీది కండలు ఇంకా సడలలేదు. మధ్య మధ్య చుట్ట బయటకి తీసి తుపుక్కున ఉమ్మి, చుట్టని మళ్ళీ యధాస్థానంలో వుంచుతున్నాడు. బల్లకి మిగిలిన మూడువైపులా ముగ్గురు మనుష్యులు చుట్టూ కూడిన జనం దగ్గర సొమ్ము వసూలు చేస్తూ వాళ్ళే అంకె చెపితే ఆ అంకెలో సొమ్ముంచుతున్నారు. కూర్చున్న ఆసామి పక్కనే ఒక ట్రంకు పెట్టె ఉంది. అందులో వరసాగ్గా కొన్ని కవర్లున్నాయి. సొమ్ము కడుతున్న వాళ్ళలో ఒకడు అందులోంచి కవరు బయటకు తీసి అతడికిచ్చేడు. గళ్ళలుంగీ ఆ కవరుని విలాసంగా మూడుసార్లు దులిపి దానిలోంచి ఓ అయిదు అట్టముక్కలు బయటికి తీసాడు-