
PANCHAMA VEDAM
₹80
In stock · 47 available
PublisherSATISH CHANDAR
LanguageTelugu
మూడో ముద్రణ ముచ్చట సతీష్ చందర్ కవితా సంకలనం 'పంచమ వేదం' మొదటి ప్రచురణ (1995) వెలువడి పదహారేళ్ళయింది. ఈ పుస్తకం వెలువడక ముందే అందులోని కవితలు వివిధ పత్రికలలో అచ్చవుతున్నప్పుడు బహుళ ప్రాచుర్యం పొందాయి. విమర్శకుల దృష్టిని ఆకర్షించాయి. 'తెలుగు వచన కవిత్వంలో తొలిసారి దళితవాదాన్ని బలంగా ప్రకటించిన కవి సతీష్ చందర్ అని కె. శ్రీనివాస్ 'దళిత సూర్యోదయ కవిత' అనే వ్యాసం (1993) లో అభిప్రాయ పడ్డారు. అప్పటి నుంచీ సతీష్ చందర్ కవిత్వం ఎన్నో 'వాద ప్రతివాదాల'కు కేంద్ర బిందువయ్యింది. 'పంచమ వేదం'లో కవితలు పలుభాషల్లోకి అనువాదమయ్యాయి. 'కన్నడ సాహిత్య పరిషత్తు' 'పంచమ వేద' పేరుతో మొత్తం గ్రంథాన్ని 2002లో ప్రచురించింది. కొన్ని కవితలను ఫ్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ కవితలను పాఠ్యాంశాలుగా స్వీకరించాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎమ్యే (తెలుగు సాహిత్యం)లో మొత్తం గ్రంథాన్నే పాఠ్యభాగంగా పరిగణించింది. ఈ గ్రంథానికి పలు పురస్కారాలు లభించాయి. ఆర్టోస్ అవార్డు (1995), ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు (1996), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం (1998), గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం (2001) వాటిలో ముఖ్యమైనవి. ఎందరో పెద్దలు 'పంచమ వేదం' చదివి తమ ఆనందాన్ని లిఖితపూర్వకంగా పంచుకున్నారు. వారిలో కొందరు ఇప్పుడు లేరు. అయినా కవిపట్ల వారికున్న వాత్సల్యాన్ని ఎప్పటికీ తలచుకునే వుంటాం. 'పంచమ వేదం' తర్వాత, సతీష్ చందర్ తన ఇతర గ్రంథాలతో పాటు మరో మూడో కవితా సంకలనాలను ('నాన్న సైకిలు', 'పసుపు జాబిల్లి', 'ఆది పర్వం') వెలువరించారు. వీటిని కూడా తెలుగు సాహిత్యలోకం విశేషంగా ఆదరించింది. సాహితీప్రియులూ, విద్యార్థులూ, పరిశోధకులూ, అధ్యాపకులూ, ఉద్యమకారులూ ఎప్పటినుంచో 'పంచమ వేదం' పునర్ముద్రణ కోసం వత్తిడి చేస్తున్నారు. తమకు పాఠ్యాంశంగా వున్న విద్యార్థులయితే ఈ పుస్తకం ప్రతులు లభ్యం కాక, ఫోటోకాపీలతో సరిపుచ్చుకుంటున్నారు. అందుకే ఈ పునర్ముద్రణ. ఈ మూడవ ప్రచురణ వెలువరించడంలో ఎంతో జాప్యం జరిగింది. అసౌకర్యానికి నిజంగానే బాధగా వుంది. కానీ మరో మారు 'పంచమ వేదాన్ని' మీ చేతుల్లో ఉంచుతున్నందుకు మహదానందంగా వుంది. మీరు కూడా సంతోషిస్తారని భావిస్తూ...