
PARIPARI PARICHAYAALU
₹100
In stock · 4 available
PublisherVANGURI FOUNDATION OF AMERICA
LanguageTelugu
ముందరిమాట మొట్టమొదట చెప్పవలసిన సంగతి: ఇందులోని వ్యాసాలను నా ప్రగల్భం' చాటడం కోసం నేను వ్రాయలేదు. ఈ ప్రసిద్ధ వ్యక్తులందరూ వారి ప్రతిభావ్యుత్పత్తులలో సాటిలేనివారు. సాధారణంగా మనం ఒక రచయితనో, కళారంగ ప్రముఖుడినో రచనలు చదివో. రంగస్థలం మీద చూసో, లేదా వారి కార్యస్థానాలలో పరిచయమయ్యో, అర్థం చేసుకున్నదానికీ, బాగా సన్నిహితంగా మసలి వారి యిష్టానిష్టాలను దగ్గరనుంచి పరిశీలించి గ్రహించినదానికీ తేడా వుంటుంది. వారి వారి అంతరిక ఆలోచనలు, ఏకాంత ప్రవర్తనలు, బాగా ఎరుకపడతాయి. అందువల్ల ఆయా వ్యక్తుల సమగ్ర వ్యక్తిత్వం తెలుసుకునే అవకాశం, మిగిలినవారికంటే దగ్గరగా మసలినవారికెక్కువగా వుంటుంది. అయితే ఎరుగుదుము కదా అని, వారి సారస్వత, కళా, వ్యక్తిత్వాల ప్రతిష్టను భంగపరిచే ప్రయత్నం, కుసంస్కారమవుతుంది. ఇలా కడచిన నలభై ఏళ్ళకుపైగా నాకు వృత్తిరీత్యా, ఒక ప్రముఖ రచయిత కొడుకునైన అవకాశం రీత్యా, వీరందరితో సన్నిహిత పరిచయం, స్నేహం, ఏర్పడ్డాయి. రాత్రింబగళ్ళు వారితో కలిసి గడిపే సందర్భాలు ఏర్పడ్డాయి. వారూ నన్ను ఆత్మీయుడిగా భావించారు. ఆ యీ కారణాలవల్ల, నాకర్ణమైన వారి వారి సారస్వత, కళావ్యక్తిత్వాలను నా వ్యక్తిగత అనుభవాలతో కలిపి చూసి, మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మిత్రులు, ఆంధ్రభూమి దైనికపత్రిక సంపాదకులు శ్రీ ఎమ్.వి.ఆర్. శాస్త్రిగారు తమ పత్రిక సాహిత్యానుబంధానికి ఏమైనా వ్రాయమంటే, ఈ పరిచయాలను ఎంచుకొని - 2004 ఆగష్టు రెండవతేదీ నాటినుంచి వారం వారం పంథొమ్మిది వ్యాసాలు వ్రాశాను. అయితే, నేననుకున్న ప్రణాళిక పూర్తికాకుండానే, నాకు ఏర్పడ్డ తీవ్ర అనారోగ్యం కారణంగా ఆపివేశాను. తరువాత వేరు వేరు సందర్భాల్లో మరి కొందరిగురించి అప్పుడప్పుడు వేరు వేరు పత్రికలలో వ్రాశాను. ఇప్పుడీ పుస్తకం వెలువరిస్తున్న సందర్భంగా నేననుకున్న మిగిలినవారి గురించి కూడా ఇప్పుడు వ్రాసి, పూర్తి చేశాను. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పక్షాన ఈ పుస్తకాన్ని ప్రచురించదలిచిన చిరమిత్రులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజుగారికి నా కృతజ్ఞత, అందంగా ముద్రించడంలో శ్రద్ధ వహించిన మిత్రులు 'రచన' శాయిగారికి మరిన్నీ కృతజ్ఞుణ్ణి.