PATHALA JALA RAKSHASULU by G.V.L.NARASIMHARAO Telugu book cover

PATHALA JALA RAKSHASULU

by G.V.L.NARASIMHARAO

₹70
In stock · 9 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తీట తీరింది యలమందయ్య మందలో సోమరి మేకపోతు ఉండేది. దాని కొమ్ములు బాగా బలంగా, పొడవుగా మెలికలు తిరిగి ఉండేవి. అసలే సోమరి. ఆ పయిన కొమ్ములు పెరిగాయి. ఇక చెప్పేది ఏముంది. పొగరెక్కి బరి తెగించింది. రోజూ మందను వదిలి దేశం మీద పడి తిరగసాగింది. కనపడ్డ వాళ్లనల్లా నాతో ఢీ కొస్తావా! అంటూ కొమ్ములు ఓరగా సాచి కవ్వించేది. అది వట్టి పనికిమాలిన సోమరి మేకపోతు. ఆ సంగతి అందరికీ తెలుసు. అందుకే ఎవరూ దాని మాటలు లెక్క చేసేవారు కాదు. ఎవరికి వారే దీనితో మనకేంటిలే అనుకునేవారు. తప్పుకు పోతా ఉండేవారు. 'ఇదంతా నన్ను చూసిన భయమే' అని అది గర్వపడేది. అలా పొగరు బాగా తలకు ఎక్కించు కుంది. ఆ రోజు మన సోమరి మేకపోతుకు ఏమీ తోచలేదు. 'ఇవాళ నా కొమ్ములు భలే తీటగా ఉన్నాయే. ఇక ఎవరో ఒకరితో ఢీ కొట్టి తీరాలి' అనుకుంది. వీధుల్లో, డొంకల్లో పడి తిరగ సాగింది. అలా వెళతా ఉండగా దానికి ఒక కోడి పుంజు ఎదురయ్యింది. 'ఎ హేయ్, పుంజూ రా. నాతో ఢీ కొట్టి ఎళ్లు!' అంత దూరాన్నించే దానిని పిలిచింది. 'నేను వేరే పని మీద ఉన్నానులే పోతూ. నా దారిన నన్ను పోనివ్వు. నీతో ఢీ కొట్టే తీరిక లేదు నాకు' అంటూ పుంజు ముక్కుతో గింజలు ఏరుకుంటా వెళ్లిపోయింది. 'ఇంకెవరు దొరుకుతా రబ్బా' అనుకుంటా ముందుకు సాగింది పోతు. కొంచెం దూరంలో ఒక పంది పిల్ల కనబడింది. దానిని చూస్తానే పోతు ఎగిరి గంతువేసింది. ఎదురుగా వెళ్లి 'నాతో ఢీ కి రా' అని కాలు దువ్వింది. 'నన్ను బాధ పెట్టకులే పోతూ! ఏదో నా పంది బతుకు నన్ను ఇలా బతక నియ్యి' అని పంది పిల్ల తప్పుకుంది. ముట్టితో మట్టి కుళ్ల గింజుకుంటా వెళ్లిపోయింది. సోమరిపోతుకు ఏమీ తోచలేదు. దాని కొమ్ములకు ఇప్పుడు మరీ దురదగా ఉంది. ఆ పక్కన మేస్తున్న ఒక ముసలి పొట్టేలు కనబడింది. దాని వేపు పరిగెత్తింది సోమరిపోతు.