
PILAKA GANAPATHI SASTRY JEEVITAM SAHITYAM
₹95
In stock · 10 available
PublisherC.P.BROWN ACADEMY
LanguageTelugu
ISBN9789381035252
మా మాట తొలితరం భావకవులు వారి కవితల్లోని ప్రేయసిపట్ల ఎనలేని గౌరవప్రపత్తిని ప్రదర్శించారు. "మఘవ మస్తక మకుట మాణిక్యరాజ్ఞి" అంటూ కృష్ణశాస్త్రి: "దైవతమువీవు నీదుప్రత్యక్షమునకు/గడియలెంచుచునుండు భక్తుడను నేను" అంటూ నాయని కవిత్వీకరించారు. అయితే వీరు ప్రేయసిని 'నీవు' అనే సంబోధించారు. కానీ, రెండోతరానికి చెందిన ఆధునిక కవులలో ప్రముఖులైన పిలకా గణపతిశాస్త్రిగారు మాత్రం “మీ మధురహాసలేశోదయమున దేవి! / తోచె నానంద విస్మృతాత్మునకు నాకు ..../ మీ స్మరణ సాగరామృతోర్మికల..." అంటూ ప్రేయసిని 'మీ'రని సంబోధించి, సి. నారాయణరెడ్డిగారన్నట్లు, భావకవిత్వంలో నవ్యతకు నాంది పలికారు. ఈ సత్సంప్రదాయం వెనుక శాస్త్రిగారి భావుకత్వం, వ్యక్తిత్వం సుస్పష్టం. ఈ సందర్భంలో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు తన జీవితచరిత్రలో శాస్త్రిగారికి సంబంధించి ప్రస్తుతించిన ఒక ఘటన గుర్తుచేసుకోవడం ఉచితం. శాస్త్రిగారు రాజమండ్రిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పుడు లక్ష్మీకాంతమ్మగారు వీరి విద్యార్ధిని, వీరి క్లాసుకు శాకుంతలం నాటకం చెప్పేవారు. ఆనాటికి చిన్నవాడు, సహజసిద్ధమైన బిడియస్తుడైన శాస్త్రిగారు శాకుంతలం పాఠం చెపుతూంటే లక్ష్మీకాంతమ్మగారు క్లాసులో తెగ నవ్వుతూ ఉండేవారట. ఆయనకి ఇబ్బందిగా ఉన్నా, బిడియంతో ఏమీ అనలేక తన పాఠం తను చెపుతూ ఉండేవారు. కానీ ఆయన తరవాత లక్ష్మీకాంతమ్మగారి తండ్రిని కలిసినప్పుడు, "మీ అమ్మాయి నవ్వు నుంచి నేను కాళిదాసు కవిత్వంలోని అందచందాలను, విలువలను, లోతుపాతులను తెలుసుకోగలిగాను; మనసులో మీ అమ్మాయిని అందుకు దీవిస్తూండేవాడిని" అని చెప్పాడట. అదీ వారి మానస సౌందర్యం, నిర్మలత్వం. ఈ సహృదయతే వీరి రచనలలో ఆసాంతం ప్రతిబింబిస్తుంది.