
PUNASCHARANAM
₹60
In stock · 329 available
PublisherDR.VAIDEHI SASIDHAR
LanguageTelugu
సౌగంధిక సౌరభం "కవి ఒక నిరంతర శిల్పి తన ఆలోచనల్ని అనుభూతుల్ని ఆరాటాల్ని పదాలుగా చెక్కుతుంటాడు" కాల్పనిక సౌగంధిక పుష్పం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు గాని దాని అద్భుత సుగంధం ఎటువంటిదో చెప్పగలను. అది అచ్చం మీరు చదవబోయే డాక్టర్ వైదేహి శశిధర్ కవిత్వంలాగా ఉంటుంది. అది అమానవ నిశ్వాసల్తో కల్మషం కానిది. పొగలెగసే యాంత్రిక జీవన ధూమంతో కలుషితం కానిది. అది నిసర్గం, నిర్మలం. ఆ అమలిన సుగంధమే ఆమె కవితల్లో మొగలిరేకులు మొదలు విరజాజుల దాక వివిధ పుష్పరూపాల్లో వికసించింది. అది కేవలం పుష్ప సుగంధమే కాదు, జీవన పుష్ప సౌరభం కూడా. నిజానికిప్పుడు సువాసనల్లో మనమున్నామా? మనలో సువాసనలు మిగిలున్నాయా? జీవన సంరంభంలో ఎన్ని పూలరేకుల్ని రాల్చుకున్నాం? ఈ బ్రతుకు 'మొనాటనీలో మెలంకలీ' సంగతేమిటి? ఎడతెగని పరుగులో, తొలకరి మట్టి వాసనలో, వాన మబ్బులో, వేపపూతలో, పాటల పుష్పాలో, కలల మామిడాకులో, ఇంటిముందు నేరేడుచెట్టు నెసరో ఏవేవో కోల్పోయాం. ప్రకృతితో సామరస్యం కోల్పోయాం. బాల్యపు రహదారులనుంచి రహూమార్గాల్లో తప్పిపోయాం. మనం మనం కాకుండా పోయాం. కోల్పోయినవి ఒకంతట దొరకపు. మర్చిపోయినవి ఒకంతట గుర్తుకు రావు. అయినా 'పునశ్చరణం' తప్పదు. పునరన్వేషణ తప్పదు. 'నిద్రితనగరం' నుంచి 'పునశ్చరణం' దాక వైదేహి ఈ పునర్యానమే సాగించింది. ఆధునిక మానవుడు మూడు విధాల పరాయితనానికి (Alienation) గురి అయ్యాడు. మొదటగా ప్రకృతి నుంచి, తర్వాత సమూహం (సమాజం) నుంచి, చివరగా తననుంచి. ఈ పరాయితనాన్ని కవిత్వంలో అధిగమించింది వైదేహి. ఆమెది వ్యక్తిగత అన్వేషణే, వైయక్తిక అనుభూతుల సమాహారమే, అయితే ఆ అన్వేషణని, అనుభూతుల్ని తననుంచి మనకి హృదయప్రసారం కొలనుగట్టునో, ఫ్రోజెన్ లేక్ దగ్గరో కూర్చున్నా, ఎండల్లో తుఫానులో నిశాదేవి శిరోజాల చీకటి నీడల్లో-వెన్నెలవానలో- ఎక్కడ నిలిచినా అది సుదూరాల ప్రకృతి పిలుపును మనసార వినటమే, దూరమైన దానికి చేరువై ఆ అమేయ సౌందర్యాన్ని కనులార కనటమే, పసివాడు పరుగు పరుగున తల్లి ఒడి చేరటమే. ఈ ఆత్మీయత వల్లనే వైదేహి ఎర్రని ఎండలోనూ మొగలిరేకులు చూడగలిగింది. ఋతువుల రాణి విలాస వదనం తిలకించింది. రోజంతా కొలను ఒడ్డున కూర్చొని అందులో హృదయం పారేసుకుంది. తుఫాను వెలిసినాక ఆకాశంలో అమాయక నవయౌవన తరుణిని చూసింది. గడ్డ కట్టిన సరస్సులో 'సహజ హృదయ సౌకుమార్యం' గుర్తించింది. 'సాదరంగా నవ్వుతూ నడిచివెళ్లే నిశాదేవి' ని అబ్బురంగా గమనించింది.