PURANADARSANAM by DR.JAYANTHI CHAKRAVARTHI Telugu book cover

PURANADARSANAM

by DR.JAYANTHI CHAKRAVARTHI

₹1,701
In stock · 3 available
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ISBN978937824775
అష్టాదశ పురాణాల్లోని విశేషాలు 1. బ్రహ్మ పురాణం అష్టాదశ పురాణాలలో బ్రహ్మపురాణం మొదటిది. 'బ్రహ్మం మూర్ధా హరేరేవ' అన్న మాట ప్రకారం ఈ బ్రహ్మపురాణం శ్రీమహావిష్ణువు శిరస్సుగా చెప్పబడింది. "నానాఖ్యానేతిహాసాధ్యం దశ సాహస్రముచ్యతే" అనగా ఈ పురాణంలో మొత్తం పదివేల శ్లోకాలున్నాయి. ఇది పూర్వభాగం ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. ఈ పురాణంలో మొత్తం 246 అధ్యాయాలున్నాయి. పేరుకి ఈ పురాణం బ్రహ్మపురాణం అనివున్నా ఇందులో బ్రహ్మదేవుడికి సంబంధించిన అంశాలు వుండవు. అత్యధికంగా శ్రీమహావిష్ణువు గురించిన విశేషాలు, కథనాలే ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అందుకే ఈ పురాణాన్ని వైష్ణవ పురాణంగానే కీర్తిస్తారు. శ్లో॥ అద్యం సర్వపురాణానాం పురాణం బ్రహ్మముచ్యతే । అష్టాదశ పురాణాని పురాణజ్ఞాః ప్రచక్ష్యతే ॥ అని విష్ణు పురాణంలోని శ్లోకం బ్రహ్మపురాణాన్ని ఆదిపురాణంగా పేర్కొంటుంది. “రాజ సేపుచ మాహాత్మ్య మధికం బ్రహ్మణోవిదుః" అన్న మత్స్య పురాణంలోని శ్లోకం ప్రకారం బ్రహ్మపురాణం రాజసపురాణంగా చెప్పబడింది. బ్రహ్మ పురాణంలో చెప్పబడిన ప్రధాన విషయాలు 1-20 అధ్యాయాలు : వ్యాస స్తుతితో ప్రారంభమైన ఈ పురాణంలో సృష్టికథనం, మన్వంతరాలకీర్తనం, ఆదిత్యుడి జననం, ఆదిత్యుడి కీర్తి, సోముడి జననం, సోమవంశ కీర్తి, పురవంశ వర్ణనం, శ్రీకృష్ణజన్మ సంకీర్తనం, శ్యమంతకో పాఖ్యానం, జంబూద్వీప వర్ణనం, పాతాళప్రమాణం, నరకవర్ణన వంటి ప్రధాన విషయాలు చెప్పబడ్డాయి. 20-40 అధ్యాయాలు : వీటిలో సర్వతీర్థ మాహాత్మ్యం, భారతవర్షం, కోణాదిత్య మాహాత్మ్యం, మార్తాండ మాహాత్మ్యం, రుద్రాఖ్యానం, పార్వతీతపస్సు, ఉమామహేశ్వర కల్యాణం, బ్రహ్మచేసిన శివస్తుతి, మన్మథుడి దహనం, దక్షయజ్ఞ విధ్వంసం, దక్షుడు చేసిన శివస్తుతి వంటి ప్రధాన విషయాలు వివరించబడ్డాయి. 40-69 అధ్యాయాలు : వీటిలో ఏకామ్రక్షేత్రమాహాత్మ్యం, ఉత్కళక్షేత్ర మాహాత్మ్యం, అవంతీవర్ణన, పురుషోత్తమ క్షేత్ర వైభవం, ప్రతిమానిర్మాణ విధానం, పురుషోత్తముడి వర్ణన, మార్కండేయుడు మర్రి ఆకుని చూడటం, మార్కండేయుడు చూసిన ప్రళయం, పంచతీర్థ మాహాత్మ్యం, నృసింహ మాహాత్మ్యం, శ్వేతమాధవ మాహాత్మ్యం, సముద్ర స్నానవిధి, కృష్ణా నదీ స్నాన మాహాత్మ్యం, గుడివాయాత్ర, ద్వాదశయాత్రలు, విష్ణులోక వైభవం తదితర విశేషాలు వర్ణించబడ్డాయి. 70-175 అధ్యాయాలు : వంద అధ్యాయాలలో సంపూర్ణంగా గౌతమీ మాహాత్మ్యం వర్ణించబడింది. 176-211 అధ్యాయాలు : వీటిలో అనంతవాసుదేవ మాహాత్మ్యం హరి అంశావతారాలు, శ్రీకృష్ణుడి జననం, గోవర్ధనోద్ధారణం, రుక్మిణీ కల్యాణం, నరకాసురవధ, అనిరుద్ధ చరిత్ర, శ్రీకృష్ణ నిర్యాణం తదితర విశేషాలు వర్ణించబడ్డాయి. 212-246 అధ్యాయాలు : వీటిలో విష్ణువు ధరించిన వివిధ అవతారాలు, యమలోక మార్గం, నరకంలోని దుఃఖాలు, అన్నదాన ప్రశంస, సదాచార వర్ణన, వర్ణాశ్రమ ధర్మాలు, మానవులకి ఉత్తమగతి ప్రాప్తించే మార్గాలు, వాసుదేవమహిమ, ద్వాపర యుగాంతం, యోగాభ్యాసం, జ్ఞాన యోగం, మోక్షప్రాప్తి, విద్య అవిద్యల స్వరూపం, వశిష్ఠ జనక సంవాదం లాంటి ప్రధాన విషయాలు వర్ణించబడ్డాయి.