SAHITYAM MOULIKA BHAVANALU - 45 by DR.PAPINENI SIVASHANKAR Telugu book cover

SAHITYAM MOULIKA BHAVANALU - 45

by DR.PAPINENI SIVASHANKAR

₹45
In stock · 15 available
PublisherPALLAVI PUBLICATIONS
LanguageTelugu
సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. సాహిత్య విమర్శనా క్రమంలో కొన్నేళ్ల కిందట నాగార్జున విశ్వవిద్యాలయానికి నేను సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఇది. ఈ వ్యాసం ఉత్తమ పరిశోధనగా ఆచార్య తూమాటి దొణప్ప స్వర్ణ పతకం సాధించింది. ఇన్నాళ్ళ కిట్లా పుస్తక రూపంలో కొద్దిపాటి మార్పు చేర్పుల్తో వెలువడుతుంది. శాస్త్ర వికాసం భావనల వికాసంపైన ఆధారపడి ఉంటుంది. ఈ అవగాహనతో సాహిత్య మూలస్వభావాన్ని పరిశీలిస్తూ కొన్ని తాత్విక భావనల్ని శోధించటానికి ఈ సిద్ధాంత వ్యాసంలో ప్రయత్నించాను. ఈ ప్రయత్నానికి ముఖ్యంగా మార్క్సిజం అముఖ్యంగా అస్తిత్వవాదం భూమికలు. సాహిత్య శాస్త్రం ఇతర శాస్త్రాలతో సంబంధం (అవసరం) లేని స్వయంసమగ్ర శాస్త్రంగా ఆలంకారికుల నుంచి ఆధునిక విమర్శకులదాకా చాలా నుంది భావించారు. దీని వల్ల సాహిత్య శాస్త్ర పరిధి సంకుచితమై, అభివృద్ధి మందగించింది. కొద్ది మంది ఆధునిక విమర్శకులు మాత్రమే ఇతర సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని పరిశీలించారు. నా మట్టుకు నేను సాహిత్య పరిశీలనకి తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, మొదలైన శాస్త్ర సాధనాల్నీ పరిభాషనీ గ్రహించాను. కథా కవిత్వాలు నాకిష్టమైన ప్రదేశాలు. విమర్శ కష్టమైన ప్రదేశం. ఇందులోకి నేనడుగుపెట్టే పాటికి రెండు సంగతులు తెలిసొచ్చినయ్. ఒకటి నా విమర్శ జ్ఞానం ఎక్కాల్సిన మెట్లు చాలా వున్నాయని. రెండు- తెలుగు సాహిత్య విమర్శ నడవాల్సిన దూరం ఎంతో వుందని. మౌలికాంశాల (Basics) నిర్ధారణ జరగకపోవటం తెలుగు విమర్శలో నాకు కన్పించిన ముఖ్యమైన లోపం. కొత్త సాహిత్యాన్ని విలువగట్టటానికి సంప్రదాయ విమర్శా సాధనాలు చాలవు. అందుకు కొత్త పరిభాషల్ని, భావనల్నీ కల్పించుకోవాలి. నిర్వచించుకోవాలి. నిర్ధారించుకోవాలి. ఒక కవిత అస్పష్టంగా ఉందని అనుకుంటాం. అయితే అస్పష్టత అంటే ఏమిటి? అనడిగితే గబుక్కున జవాబు రాదు. అంటే 'అస్పష్టత' ఒక భావనగా స్థిరపడలేదని అర్థం. ఈ సిద్ధాంత గ్రంథంలో ప్రచారంలోని కొన్ని భావనల్ని స్వతంత్రంగా నిర్వచించి, నిర్ధారించటానికీ, కొత్త పరిభాషల్ని, భావనల్ని రూపొందించటానికీ కృషి చేశాను. ఉపపత్తులకోసం ముఖ్యంగా కవిత్వాన్నే పట్టుకున్నాను. కథ, నవల, వ్యాసం మొదలైన ఇతర ప్రక్రియల్ని తక్కువచోట్ల ప్రస్తావించాను. ఏదో ఒక దాన్ని ప్రధాన ప్రమేయంగా పెట్టుకోకపోతే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా దశాభేదాలు, ఉద్యమాలు, ధోరణులు, సమాజసాహిత్యాల పరస్పర సంబంధం మొదలైన విషయాలకు సంబంధించి కవిత్వ రంగంలో ఉన్నంత అన్వయ సౌలభ్యం ఇతర ప్రక్రియల్లో లేదు.