
SAMSKRUTHA MAHABHARATHAMLO JANAPADA KATHALU
₹150
In stock · 5 available
PublisherPROF.M.JAYADEV
LanguageTelugu
ముందుమాట ఈ గ్రంథం పేరు "సంస్కృత మహాభారతంలో జానపద కథలు". సంస్కృత భారతాన్ని వ్యాసుడు రాశాడు కదా మరి దీనికి "వ్యాస భారతంలో జానపద కథలు" అనే పేరు పెట్టవచ్చు కదా అనే ప్రశ్న రావచ్చు. కానీ ఈ గ్రంథానికి వ్యాస భారతంలో జానపద కథలు అనే పేరు తగినది కాదు. ఎందుకంటే వ్యాసుడు తాను రాసిన ధార్తరాష్ట్ర పాండవుల కథకు అతను పెట్టిన పేరు "జయం" కానీ మహాభారతం కాదు. వ్యాసుని తర్వాత కాలంలో జయేతిహాసంలో కొన్ని చేర్పులు జరిగి మొదట భారతంగా, ఆ తర్వాత కాలంలో మరిన్ని చేర్పులు జరిగి మహాభారతంగా అది పిలువబడింది. "జయం"గా పిలువబడినప్పుడు అందులో 8,800 శ్లోకాలు, భారతంగా పిలువబడినప్పుడు 24,000 శ్లోకాలున్నాయని పరిశోధకుల భావన. ప్రస్తుతం మహాభారతంగా పిలువబడుతున్న ఈ గ్రంథంలో లక్షకు పైగా శ్లోకా లున్నాయి. అంటే వ్యాసుడు రాసిన జయం పండ్రెండు రెట్లకు పైగా పెరిగి మహా భారతంగా పరిణమించిందన్న మాట. వ్యాసుని తర్వాత కాలంలో అనేకమంది సంస్కృత పండితులు అనేక కాలాల్లో అనేక ఉపాఖ్యానాలను, శాస్త్ర విషయాలను ఇందులో చొప్పించారు. వీటిలో యక్షులు, గంధర్వులు అనేక దేవతలకు సంబంధించిన కథలు, విశ్వసృష్టి, ఋషులు, గోవులు, పతివ్రతలు, చక్రవర్తులు, బ్రాహ్మణుల మాహాత్మ్యం, ఊర్థ్వ అథోలోకాలు, కృష్ణుని మాహాత్మ్యం అనేక పశుపక్షులు మొదలైన వాటికి సంబంధించిన కథలు, ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర, అర్థశాస్త్ర, తత్వ, వేదాంత, ఆథ్యాత్మికాంశాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఉపాఖ్యానాల్లో ఆయా కాలాల్లో మౌఖిక ప్రచారంలో ఉన్న అనేక జానపద కథలు కొన్ని ఉన్నాయి. మహా భారతంలో ఇలాంటి జానపద కథలు ఆది, శాంతి, అనుశాసన పర్వాల్లో ఎక్కువగా ఉన్నాయి. వన, సభా, ద్రోణ, కర్ణ, శల్య పర్వాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ కథలున్నాయి. వీటిలో ఏ ఒక్క కథను వ్యాసుడు రాయలేదు. అందువల్లనే ఈ గ్రంథానికి వ్యాస భారతంలో జానపద కథలు అని గాకుండా సంస్కృత భారతంలో జానపద కథలు అనే పేరు పెట్టాను.