
SARATH SAHITHYAM - 4 BHARATHI BHAIRAVI
by SARATH
₹150
In stock · 11 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
భారతి అపూర్వబాబుకూ, అతని మిత్రులకూ తరచు ఈ రకంగా వాద వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇదిగో బాయీ? నీ సోదరులేమో ఎవరిమాటా వినరు: ఏ విషయమూ మన్నించరు. నువు చెవియొగ్గి వినవి దీ ప్రపంచములో ఏదీలేదే!" అంటారు మిత్రులు. "ఎందుకు లేదు? ఈ విషయమే తీసుకోండి. నా సోదరుల దృష్టాంతరము నేను మన్నించను. మీ పరామర్శ వాక్యాలు నేను వినను" అంటాడు అపూర్వబాబు, మిత్రులు తమ వాదాన్ని ఇంకా సాగదీసి అడుగుతారు "నువు కాలేజీలో యమ్.ఎస్సి ప్యాసైనావు. అయినా నీ తలమీద పిలక కత్తిరించావు కాదు. విద్యుచ్ఛక్తి నీ బుర్రలో సంచారము చేయటానికి ఆ పిలక మీడియమ్ కావాలేం?" "యమ్.ఎస్సి పాఠ్యగ్రంథాలలో పిలకను గురించిన వ్యతిరేక ప్రచారమెక్కడా కనిపించదు. పిలక ఉంచుకోవటం తప్పని నేననుకోను. ఇకపోతే- విద్యుచ్ఛక్తిని గూర్చి అన్ని సంగతులూ యింకా పరిశోధన కాలేదు. మీకు నా మాట నమ్మకం లేకపోతే యమ్.ఎస్సీ చదువుతున్న విద్యార్థులను అడగండి- వెళ్ళి" ఊరుకుంటారు. దానితో మిత్రులకు కోపం వచ్చి - "నీతో వాదించి లాభం లేదు" అని అంటాడు. అపూర్వబాబు నవ్వి- "ఆ సత్యం తెలిసివుండికూడా మీరు బుద్ధి తెచ్చుకోరేం?" అసలు సంగతి ఇది- అపూర్వబాబు ఒక డిప్యూటీ మేజిస్ట్రీటు కడగొట్టు కొడుకు. అన్నలంతా తండ్రిగారి మాటలు చేతలు పురస్కరించుకొని ఉత్సాహితులై బహిరంగంగానే కోడిమాంసం, హోటళ్ళలో పరోటాలు లగాయిస్తున్నారు. జందెం చిలకకొయ్యలకు తగిలించి స్నానం అయాక మళ్లీ మెడలో వేసుకోవటము మరచిపోతారు. జందెం చాకలి వాడికి వేసి ఉతికించి, ఇస్త్రీ చేయించటము విషయమై దీర్ఘ చర్చలుచేసి పకపకా నవ్వుతూ వుంటారు. అప్పటికింకా అవన్నీ అపూర్వబాబుకు పరిచయము కాలేదు. చిన్నవాడైనా తల్లి మనస్తాపాన్నీ, ఆమె కన్నీటిధారలనూ చాలా రోజులనుంచీ కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె పాపము కొడుకులను ఏమీ మందలించేదికాదు. మందలించినా ఏమి లాభము? ఆమె మాట ఎవరైనా వింటేనా? ఎప్పుడయినా మందలించబోతే తండ్రి కలిగించుకుని ఆమెనే కోపము చేసేవాడు. అందుచేత ఆమె నోరు నొక్కుకుని మెదలకుండా ఊరుకునేది. ఎందుకూ లేకపోతే అనవసరంగా భర్తతో కూడా కలహం? "నా కొడుకులు మేనమామల్లాగా కాక నాకుమల్లే తయారయితే అందులో తప్పేముంది? పిలకలు ఉంచుకోకుండా క్రాఫింగులు పెట్టుకుని 'హేట్'లు పెట్టుకుంటే తలలు కొట్టెయ్యమంటావా?" అంటూ ఉండేవాడు తండ్రి.