
SCIENCE DHRUVATARALU-50
₹50
In stock · 4 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
"రేపటి ధ్రువతారల కోసం... ఆంగ్లేయ అధ్యాపకులకన్నా భారతీయ అధ్యాపకులకు తక్కువ జీతం యిచ్చేవారని జగదీష్ చంద్రబోస్ మూడు సంవత్సరాలు ఏమీ తీసుకోకుండా ఉద్యోగం చేశాడు. మద్రాసులో హైస్కూలు చదివే యల్లాప్రగడ సుబ్బారావు భీమవరం రాగానే తండ్రి మరణించాడు. మళ్ళీ సుబ్బారావు మద్రాసు వెళ్ళాలని తల్లి పుస్తెలమ్మి చార్జీలకూ, పరీక్షఫీజుకు యిచ్చింది. కలకత్తాలో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ గా పనిచేసే సి.వి.రామన్ సాయంకాలం పార్టెమ్ పరిశోధన ప్రారంభించాడు. ఆ తర్వాతనే 'రామన్ ఎఫెక్టు' కనుగొన్నాడు. శాంతి స్వరూప్ భట్నాగర్ రచించిన 'కుల్గాత్' ను యిప్పటికి 'కాశీ' విశ్వవిద్యాలయంలో ప్రత్యేక సందర్భాలలో పాడుతారు. ఆకాశవాణిలో పాటించే శకసంవత్సర పద్ధతిని మేఘనాథ సాహా రూపొందించాడు. హైదరాబాదుకు యిరువైపులా ఉండే మూసీ, ఈసీల నదుల మీద విశ్వేశ్వరయ్య త్యాములు రూపకల్పన చేసి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు ఏర్పరచారు. సత్యేంద్రనాథ్ బోస్లమంచి సంగీత పరిజ్ఞానంతో పిల్లనగోవిని అద్భుతంగా వాయించాడు. సివిరామన్ సంగీత వాయిద్యాలమీద పరిశోధన చేయగా, జహంగీర్ భాభా గొప్ప సౌందర్య దృక్పథం వున్న సృజన శీలి. కొలచల సీతారామయ్య హోటల్లో గిన్నెలు కడిగి, పొద్దు గడిపి, పరిశోధన చేశారు. శాస్త్రవేత్తల జీవితాలను తెరచి చూస్తే యిటువంటి ఆసక్తికరమైన విశేషాలు వెలుగులోకి వస్తాయి. వారి శాస్త్ర పరిశోధన తోపాటు ఈ సమాచారం చదువరికి ఆసక్తితో పాటు, స్పూర్తిని కల్గిస్తుంది. సుబ్రహ్మణ్య చంద్రశేఖరక్కు బాబాయ్ సివిరామన్, దేవేంద్ర మోహన్ బోస్కు మేనమామ జగదీష్ చంద్రబోస్ 'రోల్ మోడల్స్' గా వుండటం వల్లనే వారు అంతగొప్ప శాస్త్రవేత్తలు కాగలిగారు. సైన్స్ అంటే ఎంసెట్ అనీ, చదువు అంటే ఉద్యోగమనీ సాగే విద్యావిధానంలో సమాచారం, సమీకరణాలుంటాయి కానీ మనసుకు స్పందన కల్గించే జీవిత గాధలుండే అవకాశం లేదు. ఈ నేపధ్యంలో ఈ పుస్తకంలో వివరించబడిన పాతికమంది భారతీయశాస్త్రవేత్తల జీవిత విశేషాలు విద్యార్థులకు స్ఫూర్తిని కల్గిస్తాయని నా నమ్మకం. అలాగే సైన్స్ బోధించే అధ్యాపకులకు తమ బోధనను ఆసక్తికరం చేయడానికి ఈ పుస్తకం దోహదపడతాయి. గత వందసంవత్సరాలలో మన భారతదేశ సైన్స్పై, సైన్స్ పరిశోధనపై విశేష ముద్రవేసిన వారిలో కొందరిని యిందులో పొందుపరిచాం. ఇంకా చాలా మంది వున్నారు. కొందరు సరైన గుర్తింపునోచుకోలేదు. భవిష్యత్లో మరికొందరి విశేషాలను చేర్చడానికి ప్రయత్నిస్తాం. గత అయిదు సంవత్సరాల కాలంలో వివిధ సందర్భాలలో, వివిధ పత్రికలలో నేను రాసిన వ్యాసాలను ముడిసరుకుగా వాడుకుని ఈ పుస్తకం రూపొందించాం. ఆయా పత్రికాధిపతులకూ, సంపాదకులకూ కృతజ్ఞతలు, 'మధులత' రెడ్డిగారికి ధన్యవాదాలు! ఈ పుస్తకం మీ అభిమానానికి నోచుకుంటుందని నా ప్రగాఢ నమ్మకం! ఈ 'ధ్రువతారలు' పుస్తకం కొందరినైనా 'రేపటి ధ్రువతారలు' గా చేయాలని పెద్ద ఆశ! నాగసూరి వేణుగోపాల్