
SEEMA SANTHAKAM
₹500
In stock · 5 available
PublisherDR.TUMMALA RAMAKRISHNA
LanguageTelugu
అపురూపమైన దళిత జీవితానుభవ చిత్రణ - కేతు విశ్వనాథరెడ్డి 'ఓ సాయంత్రం' కథలో కథకుడు తన మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మిత్రుని పేరు 'సత్యం'. ఎదురు చూసినా ఎంతకూ రాని, ఆ 'సత్యం' కథ చివర్లో ఒక సంకేతంలా మారిపోతాడు. ఆ సంకేతం మన చుట్టూ వుండే వాస్తవిక జీవితాన్ని పట్టి చూపేది. ఈ సంకేతం ద్వారా నానాటికి జీవితం అడ్డగోలుగా తయారవుతోందనీ, అన్ని మానవీయ విలువలు ధ్వంసం అయిపోతున్నాయనీ, అలజడీ, సంక్షోభం చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది. అంతేకాదు దీనికి మూలమైన సామాజిక నేపథ్యాలు కూడా అర్థమవుతాయి. ఉత్తమ పురుషలో సాగిన ఈ కథలో జీవితాన్ని ప్రేమించే ఒక విద్యావంతుడైన మధ్యతరగతి భావుకుడి వేదన కనిపిస్తుంది. జీవితాన్ని ప్రేమించడం అంటే జీవితంలోని అసత్యాలను, వంచనలనూ, పీడనలనూ గుర్తించడం, ఖండించడం. ఈ కథలోని కథకుడు తన వ్యక్తిగతమైన సంఘర్షణలో భాగంగానే వీటిని గుర్తిస్తాడు. ఈ మాట ముందుగా చెప్పడం ఎందుకంటే, తుమ్మల రామకృష్ణ కథారచనా సాధనాలక్ష్యంలో ఈ కథ ఆత్మగతమైన వ్యక్తినిష్టమైన ఒక అన్వేషణకు చిహ్నమని, గుర్తించమని చెప్పడానికి, రామకృష్ణ తనలోంచి చూడడంతో ఆగిపోలేదు. గ్రామీణ జీవితంలో ఇటీవల వస్తున్న పరిణామాల నుంచీ వాటి మధ్య ఉండే సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ సంబంధాల నుంచీ చూడడానికి కథకుడిగా ప్రయత్నించాడు. గ్రామీణ జీవితంలోని కులాలను, కుటుంబాలనూ, వృత్తులను వాటి విచ్ఛేదాలను, వాటి పరివర్తన దశా దిశలనూ చిత్రించాడు. ఈ పల్లెటూళ్ళు కాల్పనిక కవులు వర్ణించినట్లు నయనానందకరాలు కావు, హృదయాకర్షకాలు కావు. ఇవన్నీ సరళీకరణవైపూ, ప్రవేటీకరణ వైపూ, ప్రపంచీకరణ వైపూ సాగిపోవటానికి సిద్ధంగా ఉన్న పల్లెటూళ్ళు. ఇవి ఈనాటి రాజకీయ కుతంత్రాలను, దోపిడీ పద్ధతులనూ చాకచక్యంగా అమలు చేయగలిగిన నేర్పుల అధీనంలోకి చేరిపోతున్నవి.