
SHIVALEELALU - 25 SHIVA RUPALA KATHALU
by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA
₹250
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
శివలీలా దర్శనం వేదభూమిగా కీర్తి పొందిన భారతావనిలో చెట్టు, పుట్ట, పర్వతాలు, నదులు, సెలయేర్లు, ఒక్కటేమిటి... అణువణువూ శివసంస్తుతికి అలవాలమై చైతన్యంతో పరిఢవిల్లుతుంటాయి. అందుకే జగత్తంతటికీ శక్తిని ముక్తిని ప్రసాదించే ఆ శివుడి లీలల్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస జ్ఞానులకైనా, అజ్ఞానులకైనా కలుగుతుంది. దేశానికి రాజైనా, వీధి వీధికి తిరిగే బిచ్చగాడైనా ఆయన దివ్య లీలా పరీక్షలకు బద్ధులే కదా! మహాశివుని లీలలు ఎవరికీ అంత తేలిగ్గా అర్ధం కావు. ఆయన గురించి తెలుసుకోవడమంటే ఒకరకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే! ఎందుకంటే సృష్టే ఆయన. ఆయనే సృష్టి. అగణితమైన ఆ పరమేశ్వరుని లీలలను వింటుంటే అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ.... ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆ తరువాతే తెలుస్తుంది. అది మనలో ఆశ్చర్యాన్నేకాదు, అభిలాషనూ రేకెత్తిస్తుంది. ఒకసారి మార్కండేయ మహర్షి ఆ శివ లీలామహిమలను తెలుసుకోవాలనే ప్రయత్నంలో బ్రహ్మ విష్ణువులను ప్రార్థిస్తే వారిరువురూ ఆ శివుడి లీలా విశేషాలను అసాంతం చెప్పగలిగేందుకు తమ శక్తి చాలదనీ, సాక్షాత్తు ఆ సదాశివున్నే అడిగి తెలుసుకోమని ఆయనకి సమాధానమిస్తారు. శివుని ప్రసన్నం చేసుకుని మార్కండేయుడు అద్భుత శివ లీలాగాథలను విని తరిస్తాడు. శివుడు అవతరించిన ప్రతిరూపమూ జగత్తుకు కళ్యాణకారకమే! ప్రతీదానికి ఒక ఆంతర్యం-అంతరార్థం ఉంటుంది. వాటిని పురాణాలు అఖ్యానాలు-ఉపాఖ్యానాలుగా వర్ణిస్తాయి. అయితే పురాణాలు వర్ణించిన ఆయా సందర్భాలను తెలుసుకొని వాటిని చదువుకోవటం కష్టమైన పని. పురాణాలపై ఎంతో పట్టు ఉంటే గాని ఇది సాధ్యం కాదు. అటువంటి వారందరికీ ఆ శివలీలా రహస్యాలని సులభశైలిలో, తేట తెలుగులో వివరించి చెప్పేదే 'శివలీలలు' అనే ఈ పుస్తకం. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ కారకాలనే ఐదు విభాగాలుగా శివరూపాలను విభజించుకుని, ఆయా కారకాలలోని రూపాలను, వాటి వెనుకనున్న కథలను ఆసక్తిగా వివరించారు రచయిత. అంతేకాదు.... ఆయా మూర్తుల రూపాలను సైతం చిత్రాల ద్వారా ఇందులో మనకి దర్శింపజేసారు. అలా పరమేశ్వరుడి పంచ వింశతి లీలా రూపాలను, వాటి వెనుక దాగిన కథలను మనకు అందించి మహోపకారం చేసారు రచయిత కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య. శైవాగమశాస్త్రంపై తనకున్న పాండిత్యాన్నంతటినీ రంగరించి రూపొందించిన ఈ పుస్తకం శివుడి లీలా విశేషాలని తెలుసుకోవాలనుకునేవారికి అత్యంత విశేషంగా ఉపయోగిస్తుంది. పరవశింపజేసే ఆ శివరూపాలను ఒక్కసారి చూచినా చాలు! మనస్సును పరవశింపజేస్తాయి. తన్మయత్వాన్ని కలిగిస్తాయి. దివ్యమైన ఆ అద్భుతగాథలను చదివితే ఆ శివుడి అనుగ్రహం కలుగుతుంది.