
SIVAPURANA RAHASYALU
by BHAMIDIPATI BALATRIPURASUNDARI
₹250
In stock · 7 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
ముందుమాట పరమేశ్వర వైభవం భారతీయ సంప్రదాయంలో దేవుడు ఒక్కడే. అయినా, దేవతలు ఎందరో ఉన్నారు. భక్తుల అభిరుచి మేరకు ఒకే దైవం భిన్న విభిన్న నామ రూపాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఇంతమంది దేవతలలో ఎవరి ప్రత్యేక వారిదే. ఎవరి ప్రశస్తి వారిదే. దైవాన్ని పరమేశ్వర రూపంలోనే ఎందుకు ఆరాధించాలి? అని ప్రశ్నించుకొంటే, ఇతర దేవతారూపాలలో కన్పించని ఒక ప్రత్యేకత శివునిలో కనిపిస్తుంది. శివుడు తన మూడవ కంటి మంటతో మన్మథుడిని భస్మీపటలం చేశాడు. యుముడిని తన్ని తరిమి వేశాడు. మన్మథుడు అంటే శృంగారదేవత. దాంపత్యబంధానికి, తద్వారా సంతానానికి కారకుడు. అంటే పరోక్షంగా సృష్టి కారకుడు అన్నమాట. ఇక, యముడు అంటే మనకు తెలుసు, మృత్యువే. జననమరణాలకు కారకులు కాముడు, కాలుడు, కాముడిని, కాలుడిని జయించిన పరమేశ్వరుడు జననమరణాలను జయించినవాడు. జననమరణాలు లేని మోక్ష సామ్రాజ్యం కావాలంటే, జననమరణాలను జయించిన పరమేశ్వరుడిని ఆరాధించాలి. వేదకాలం నుంచి ఈనాటి వరకు వెలువడిన అత్యంతమైన వాజ్ఞ్మయంలో పరమేశ్వరవైభవం అత్యద్భుతంగా కనిపిస్తుంది. వేదమనే విత్తనంలో నుంచి పురాణ మహావృక్షాలు అంకురించాయి. వేద వైద్యుడైన పరమేశ్వరుడి దివ్యతత్త్వాన్ని వివరించడానికి దిగివచ్చిన వాఙ్మయం 'శివపురాణం' శివపురాణంలో కథలుగా, గాథలుగా పరమేశ్వరతత్త్వం దాగి ఉన్నది. ఆ కథల చాటున మనం తెలుసుకోవలసిన ఎన్నో రహస్యాలున్నాయి. వాటిని సరళమైన శైలిలో, వాడుక భాషలో వచనరూపంలో జనసామాన్యానికి చేరువ చేయాలనే సత్సంకల్పంతో శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి 'శివపురాణ రహస్యాల'ను ఈనాటి పాఠక లోకానికి అందించారు. శ్రీమతి బాలాత్రిపురసుందరిగారి ప్రయత్నం సఫలమైంది. వారి రచనా వ్యాసంగం సార్ధకమైంది. ఈ రచనలో బాలాత్రిపురసుందరిగారు నిర్మించుకొన్న ప్రణాళిక చాలా ప్రశస్తమైనది. శ్రీమహావిష్ణువు శివుడి సూచన మేరకే వ్యాసుడుగా అవతరించి, వేదవిభాగం చేశాడని, వేద ధర్మాన్ని గాథలుగా మలచి పురాణాలుగా తీర్చిదిద్దాడని రచయిత్రి వివరించారు. పురాణాల పుట్టుకను, లక్షణాలను, వాటి విభాగాలనూ వివరిస్తూ, రచనకు ఉపక్రమించడం, దక్షయజ్ఞ సన్నివేశాలతో కథా ప్రారంభం చేయడం ఈ రచయిత్రి సూక్ష్మేక్షికతకు నిదర్శనం. దాక్షాయణి పార్వతిగా జన్మించడం, ఆ పార్వతి పరమశివుడే భర్తగా కావాలని తపస్సు చేయడం, పార్వతీ కల్యాణానికి మార్గం సుగమం కావడం మొదలైన అంశాలను చక్కని కథాకథన శైలిలో అందించారు రచయిత్రి. జ్ఞానస్వరూపుడైన శివుడు దక్షిణమూర్తిగా మారి మౌన వ్యాఖ్యతోనే పరబ్రహ్మతత్త్వాన్ని బోధించి, మహర్షులందరికీ సంశయ నివృత్తి' చేశాడని చెప్పిన శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరిగారు దక్షిణామూర్తి తత్త్వాన్ని సంక్షిప్త సుందరంగా నిరూపించారు.