
SPOORTHI KATHALU - 45
₹45
In stock · 734 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఎవరు ఉత్తములు? బుద్ధుని వద్దకు ఒకనాడు ఒక జిజ్ఞాసువు వచ్చాడు. అతడు బుద్ధునితో "అయ్యా! ఈ లోకంలో ఎన్నో రకాల మనుష్యులున్నారు. వారిలో ఎవరు ఉత్తములో సెలవియ్యండి"? అన్నాడు. అందుకు బుద్ధుడు ఈ లోకంలోని మనుష్యుల్ని తలచుకుని ఒక చిరునవ్వు | నవ్వారు. పిదప ఆ జిజ్ఞాసువుతో ఇలా అన్నాడు. "ఈ లోకంలో మనుష్యుల్ని వారు చేస్తున్న పనుల్ని బట్టి నాలుగు రకాలుగా చెప్పవచ్చు. అందులో ఒక రకం వారు తమ కొరకు గాని ఇతరుల కొరకు గాని ఏమీ చెయ్యరు. రెండో రకం వారు తమ కొరకు ఏమీ చేయకపోయినా పరుల కోసం ఏ పనైనా చేస్తారు. మూడోరకం వారు పరులకొరకు ఏమీ చేయరు. కానీ తమకోసం ఏ పనైనా చేసుకుంటారు. ఇక మిగిలిన వారు నాలుగో రకం వారు. వీరు మాత్రం నిర్విరామంగా పని చేస్తూనే వుంటారు. తమ కొరకు మరియు పరులకొరకు శ్రమిస్తుంటారు. అయితే చాలా మంది అనుకునేది ఏమిటంటే- తమ కోసం గాక కేవలం పరులకొరకు శ్రమించే వారే ఉత్తములని అనుకొంటారు... కాని అది నిజం కాదు. తమ బాగుకోసం, తమ పొరుగువారి క్షేమంకోసం నిరంతరంగా శ్రమించే నాలుగోరకం మనుష్యులే ఉత్తములని నా భావన" అన్నారు, బుద్ధ భగవానుడు. సత్యం, అహింస వంటి ఉత్తమమైన ధర్మాలను బోధించిన బుద్ధభగవానుడు పనికి ఎంతో విలువనిచ్చాడు. ఈ మాటలు విన్న జిజ్ఞాసువు సంతృప్తి చెంది బుద్ధునికి నమస్కరించి అక్కడినుండి కదిలాడు. కనుక చిన్నారులూ! మనమంతా పనికే విలువనిచ్చి నిరంతరం శ్రమించి ఉత్తములుగా మారుదాం. సద్వినియోగం పిల్లలూ! బౌద్ధమత స్థాపకుడైన బుద్ధుడు ఒకరోజు తన శిష్యుడైన ఆనందుడితో కలిసి బయలుదేరాడు. శ్రావస్తీ నగర వీధుల్లో తిరగసాగాడు. కొంతసేపటికి ఆ గురుశిష్యులకు ఒక దుప్పటి కొనుగోలు చేస్తున్న ఒక యువకుడు కనిపించాడు. వారు ఆ యువకుడిని సమీపించారు. “ఈ దుప్పటి కొన్నాళ్లకు చిరిగిపోతుంది కదా. అప్పుడు దీన్నేం చేస్తావ్?” అని అడిగాడు బుద్ధుడు. "దీన్ని రెండు ముక్కలుగా చింపి అంగవస్త్రంగా వాడుకుంటాను" అన్నాడు ఆ యువకుడు. “మరి అవికూడా చిరిగాయనుకో...?” అన్నాడు బుద్ధుడు కుతూహలంగా. "ముక్కలుగా చేసి ఇల్లు తుడుచుకోవడానికి వాడుకొంటాను" అన్నాడు ఆ యువకుడు. “అవికూడా పనికిరాకుండా పాతబడిపోయి, ముక్కలై పోయాయనుకో! అప్పుడేం చేస్తావ్?” అన్నాడు నవ్వుతూ బుద్ధుడు. "ఆ ముక్కలన్నిటినీ మట్టితో కలిపి పిసికి బొమ్మలు చేస్తాను. ఆ బొమ్మలను అమ్ముకొని, వచ్చిన డబ్బుతో మరో కొత్త దుప్పటి కొంటాను" అన్నాడు ఆ యువకుడు ఓపిగ్గా.