
SRI VEDANTASAARAM
₹55
In stock · 7 available
PublisherDR.P.SASIREKHA
LanguageTelugu
అక్షర నీరాజనం అది ఒక నందనం. ఆ నందనంలో ఒక కల్పతరువు. ఆ కల్పతరువు అద్వైతామృతఫలాలని అందిస్తూంటుంది. అవి సేవించిన వారిని తన చల్లని నీడతో సేదదీర్చి హాయినిస్తుంది ఆ వృక్షచ్ఛాయ. ఆ కల్పతరువు మా ఆచార్యవర్యులు మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారైతే ఆ చల్లని వృక్షచ్ఛాయ వారి సహధర్మచారిణి శ్రీమతి సుబ్బలక్ష్మి. వసిష్ఠునికి అరుంధతిలా, తపోనిష్ఠలో ఉన్న పరమేశ్వరునికి పార్వతీదేవిలా సర్వకాల సర్వావస్థలయందు తన పరిచర్యలతో పతిదేవుని అలరించే ఆదర్శ గృహిణి ఆమె. భవభూతి చెప్పినట్లుగా - “అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాస్వవస్థాను య -ద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్నహార్యో రసః. కాలేనావరణాత్యయాత్పరిణతే యత్స్నేహసారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమస్యేకంహి తత్రాప్యతే.” అద్వైతం వారి దాంపత్యం. ఆ అద్వైత కాంతిలో నా జన్మ వెలుగును చూసింది. గురుకులం అంటే తెలియని నాకు ఒక గురుకులాన్ని చూపింది వారి నందనం. ఆచార్యుల బోధనకు ఆమె లాలనతోడై 'అధ్యయనం' నాకు నందన విహారమైంది. అలాంటి అమృతమూర్తికి సాధ్వీమణికి ఈ చిన్నపుస్తకరూపంలో "అక్షరనీరాజనాన్ని” అందించాలనుకున్నాను. నా కోరిక ఫలించింది. ఆ అద్వైతమూర్తి అనుమతి లభించింది. ఆచార్యపత్నికి, శిరసా ప్రణమిల్లి యీ “సువర్ణహారాన్ని” అందుకోమని ప్రార్థిస్తున్నాను.