SUNDARA BHARATHADESA YATRADARSINI by SHAIK ABDUL HAKIMJANI Telugu book cover

SUNDARA BHARATHADESA YATRADARSINI

by SHAIK ABDUL HAKIMJANI

₹300
In stock · 10 available
PublisherLAKSHMI SRINIVASA PUBLICATIONS
LanguageTelugu
నేడు మానవ జీవితం అవిశ్రాంతంగా పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించినట్టయితే మనసు అలౌకికానందం పొందుతుంది. యాంత్రికంగా సాగే అనునిత్య కార్యక్రమాలతో విసిగి, వేసారి మనం నివసిస్తున్న ప్రాంతాల నుండి దూరంగా వెళ్ళి ఇతర ప్రాంతాలను సందర్శించడమే పర్యాటకం అని చెప్పవచ్చు. ఇతర ప్రాంతాలను మనం దర్శించేటప్పుడు అక్కడ చరిత్ర, సంస్కృతి, ప్రాచీన కట్టడాలు, కళలు, ఆహారపు అలవాట్లు, "విందులు, వినోదాలు ఇత్యాది అనేక విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్ళి కనీసం 24 గంటలైనా గడిపి అక్కడి కట్టడాలను తిలకించడం, ఆ ప్రాంతపు వింతలు, విశేషాలను తెలుసుకోవడాన్నే టూరిజం యాక్టివిటీ అనవచ్చు. దేశీ పర్యాటకులను డొమెస్టిక్ టూరిస్టులని, దేశం విడిచి ఇతర దేశాలను సందర్శించే వారిని ఇంటర్నేషనల్ టూరిస్టులని అంటారు. ఇదే రీతిలో ఒక దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళే పర్యాటకుల్ని ఇన్బెండ్ టూరిస్టులని, దేశం విడిచి ఇతరదేశాలకు వెళ్ళే పర్యాటకుల్ని అవుట్ బౌండ్ టూరిస్టులని అంటారు. ఇలా పర్యటించే వారికి టూరిస్టు గైడ్లు, హోటళ్ళు, రవాణా వాహనాలు, భోజన వసతి కల్పించే సంస్థలు ఇత్యాది వాటిని టూరిస్టు సర్వీసెస్ అని పిలుస్తారు. ఇటువంటి అనేకమంది సహకారంతో సుదూర ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మనం ఎందుకు దర్శించాలనే ప్రశ్న ఉదయించక మానదు. అలసిన శరీరానికి విశ్రాంతి, ఉల్లాసం, ఆహ్లాదం, వినోదం ఇత్యాది వాటికోసం ప్రతిఒక్కరూ పర్యాటక క్షేత్రాలను దర్శిస్తారు. వీటిలో చారిత్రక, ఆధ్యాత్మిక నిర్మాణాలు కూడా ఉన్నాయి. పుణ్యం, పురుషార్ధం రెండూ దక్కేలా కొందరు ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. అక్కడ భక్తిపారవశ్యంలో మునగడమేకాక ఆయా ఆలయాల శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి ముగ్ధులౌతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం బంధువులను, స్నేహితులను కలుసుకొని కొత్త విషయాలను తెలుసుకొని ఎంతో సంబర పడిపోతాము. అదేవిధంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, శిల్పకళ, ఆహార నియమాలు, ఉత్సవాలు, చరిత్ర, హస్తకళలు ఇత్యాది విషయాలు తెలుసుకొని అలౌకికానందం పొందుతారు. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాల గురించి నేను అనేక వ్యాసాలు పత్రికల్లో రాశాను. ఇటువంటి అతి ముఖ్యమైన పర్యాటక కేంద్రాలకు పుస్తకరూపం ఇవ్వాలని కోరిక కలిగింది. ఈ పుస్తకంలో నేను సందర్శించిన కొన్ని క్షేత్రాలతోపాటు పత్రికలకు రాసిన పర్యాటక వ్యాసాలు, పర్యాటకశాఖ వారినుండి సేకరించిన సమాచారం, పలు గ్రంథాలు చదివి నేను పొందిన జ్ఞానం, అంతర్జాలం నుండి సేకరించిన సమాచారం ఇలా అనేక రకాలుగా శ్రమించి ఈ గ్రంథాన్ని రూపొందించాను. నేను రచించిన 'ఆంధ్రప్రదేశ్లో పర్యాటక కేంద్రాలు' అనే గ్రంథానికిగాను 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. కిరణ్కుమార్ రెడ్డి చేతులమీదుగా పర్యాటకశాఖవారి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నాను. ఆ స్ఫూర్తితో 'సుందర భారతదేశ యాత్రాదర్శిని' గ్రంథాన్ని రూపొందించాను. ఇది పర్యాటకులతోపాటు విద్యార్థులకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.