SWATHMAKATHA by AKKIRAJU RAMAPATHI RAO Telugu book cover

SWATHMAKATHA

by AKKIRAJU RAMAPATHI RAO

₹558
In stock · 1 available
PublisherMODUGULA RAVIKRISHNA
LanguageTelugu
డా|| అక్కిరాజు రమాపతిరావు స్వాత్మకథ (వేయిపున్నముల వేడుక) సాహితీ జీవనసాఫల్య అభినందన సంపుటి గుంటూరుజిల్లా వేమవరం గ్రామంలో, ఆంధ్రదేశంలో అతిప్రసిద్ధి కెక్కిన 'అక్కిరాజు' పండిత వంశంలో జన్మించిన రమాపతిరావుగారు (04.05.1936) నరసరావుపేటలో, హైదరాబాదులో విద్యాభ్యాసం గావించారు. కందుకూరి వీరేశలింగం సారస్వతాన్ని సమగ్రంగా పరిశీలించి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్ పట్టం సంపాదించారు. హైదరాబాదు న్యూసైన్స్ కళాశాలలో, తెలుగు అకాడెమిలో ముప్పైనాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసి, 1994లో ఉద్యోగవిరమణ గావించారు. డాక్టర్ రమాపతిరావుగారు వీరేశలింగంగారి సారస్వతాన్ని సమగ్రంగా పరిశీలించిన పరిశోధకుల్లో మొట్టమొదటివారు. వీరు రచించిన సిద్ధాంత ప్రబంధం విదేశవిద్వాంసుల ప్రశంసలు పొందింది. డాక్టర్ రమాపతిరావుగారి సారస్వత సాహిత్య కృషి బహుముఖీనమయినట్టిది. వారి కృషి దాదాపు రెండు వందల చిన్న పెద్ద గ్రంథాలరూపం పొందింది. ఆంధ్రదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసిన కవుల, చరిత్రకారుల, సాంఘికసంస్కర్తల, భాషావేత్తల జీవిత విశేషాలు తెలుసుకోవాలన్నా, ఆంధ్రదేశ సాంస్కృతిక పునరుజ్జీవన సమగ్ర స్వరూపాన్ని దర్శించాలన్నా రమాపతిరావుగారి గ్రంథాలను చదువక తప్పదు. ఆంధ్రదేశం విస్మరించిన మహనీయుల కృషినీ, సాంస్కృతిక పునరుజ్జీవన ఘట్టాలనూ వారు త్రవ్వి తలకెత్తారు. డాక్టర్ రమాపతిరావుగారి రచనలు స్థూలంగా సారస్వత సాహిత్యరచనలు, ఆధ్యాత్మిక రచనలుగా విభజింపవచ్చు. “జారుడుమెట్లు” “ఋణానుబంధం” మొదలయిన పది నవలలూ, “మైథిలి” “మంచుకురిసినరాత్రి” మొదలయిన ఆరు కథాసంపుటాలు రచించారు. వీరి కథలు, ఇతర భాషల కనూదితములయ్యాయి. కందుకూరి వీరేశలింగం, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు, అక్కిరాజు ఉమాకాంతవిద్యాశేఖరులు, వెన్నెలకంటి సుబ్బారావు, గిడుగు వేంకటరామమూర్తి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కోరాడ రామకృష్ణయ్య, తిరుమల రామచంద్ర మొదలయిన మహామనీషుల సారస్వత సాహిత్యసేవలను తెలిసికొనదలచినవారు రమాపతిరావుగారి రచనలను అవశ్యమూ చదవాలి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, బిర్లా ఫౌండేషన్, నేషనల్ బుక్స్టెస్ట్, ఇతర స్వదేశ విదేశ సాహిత్యసంస్థలతో సంబంధం కలిగి ఉండి సారస్వతాభిరుచికి దోహదం చేసిన డా. అక్కిరాజు రమాపతిరావుగారిని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 'సాహితీ జీవనసాఫల్య పురస్కారం'తో గౌరవిస్తూ అందిస్తున్న బహూకృతి 'స్వాత్మకథ'. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ గుంటూరు