TOORPU GODAVARI KATHALU by DR.DAVULURI SRIKRISHNA MOHANA RAO Telugu book cover

TOORPU GODAVARI KATHALU

by DR.DAVULURI SRIKRISHNA MOHANA RAO

₹80
In stock · 4 available
PublisherDR.DAVULURI SRIKRISHNA MOHANA RAO
LanguageTelugu
డా॥ దవులూరి శ్రీకృష్ణమోహనరావు 1. నెరజాణ ఆంధ్రరాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి ఎన్నాళ్ళో కాలేదు. ఆ సాంబారు వాసన యింకా వదల్లేదు. మద్రాసులో మూల పడేసిన బస్సులను ముస్తాబు చేసి మన రోడ్ల మీద ఎక్కిస్తున్నారు చేతిలో పదిరూపాయలున్నవాళ్ళు. పై షోకులు చేసికొన్నా ముసలితనం మాయమవని వృద్ధ వేశ్యలా ఉన్న ఒక డొక్కు బస్సు కాకినాడ కోటిపల్లి రూట్లో దడదడలాడిస్తూ బోల్డు సందడి చేసేది. దాని డ్రైవర్ను పిల్లలందరూ డ్రైవర్తిత అంటారు కాని అతని అసలు పేరు రజబాలి. రజబాలి పూర్వం పట్టాభిరామ కమర్షియల్ సిండికేటులో పనిచేసేవాడు. అతి జాగ్రత్తగా చీమ మీద కూడ బస్సు ఎక్కకుండా నడిపేవాడు. అతను సినీమాకెడితే హాల్లో ఒక సీనే క్రియేటయ్యేది. ఆ సీను చూడటానికి అతని అభిమాన సంఘం కూడ వెంట వెళ్ళేది. సినిమా చూస్తున్నాడంటే అందులో పూర్తిగా లీనమైపోయేవాడు. హీరోయిన్ కన్నీళ్ళు కారుస్తుంటే యితని టవల్ తడిచిపోయేది. కామెడీ సీన్ వస్తే పకపకా నవ్వుతూ పక్కోడి భుజం విరగ్గొట్టేసేవాడు. ఇంకో చిత్రమేమిటంటే తెర మీద ఎవరో నడిచి వెడుతుంటే వెనకాల ఎవడైనా ఏ కత్తో పట్టుకొస్తుంటేనో లేక ఏ చాటునో కత్తితో దాక్కుంటేనో సీటులోంచి కంగారుగా లేచిపోయి హడావిడిగా అరిచేసేవాడు “ఒరోరేయ్ సన్నాసి, చూస్కోరా, ఆ ఎదవ నా కొడుకు పొడిచేసేలాగున్నాడు". ఇక హాలంతా గొల్లుమనేది. రజబాలిలోకింకో వీక్ నెస్ ఉంది. స్కూల్కెళుతున్న పిల్లలెవరైనా చేయూపితే బస్సాపి ఎక్కించుకొనేవాడు. టిక్కెట్టు కొనే పని లేదు కనుక పిల్లలు ఖుషీఖుషీగా హుషారుగానే ఉండేవారు కాని కంపెనీ ఓనర్లకే మండిపోయేది. అందుకొకసారి కంపెనీవాళ్ళు నిలదీశారు. "వాళ్ళు ఎలాగూ టిక్కెట్లు కొనలేరు. అందువలన సీట్లు అడగరు. బస్సు మధ్యలో నిలబడతారు. దాని వలన మీకేం నష్టం" అని ఎదురు అడిగాడు రజబాలి. శ్రద్ధగా పనిచేస్తాడు అతను చెప్పేది నిజమే కనుక కంపెనీ అంతగా పట్టించుకోలేదు. అతనికింకో అలవాటు అయింది. ఉచితంగా బస్సెక్కించుకొంటున్నాడని దార్లోని పిల్లలందరూ అతనికి సలాములు చేసేవారు. అతను వాళ్ళకు ప్రతి సలాము చేసేవాడు. దీనితో నాలుగు ట్రిప్పులేయాల్సిన బస్ మూడు ట్రిప్పులే వేస్తుండటంతో రజబాలికి వయసైపోయిందని కంపెనీ డిసైడైపోయి రిటైర్మెంటు యిచ్చేసింది. తిక్కొచ్చిన రజబాలి రకరకాల వ్యాపారాలతో కొంత ఆస్తి సంపాదించుకొన్న అన్న కొడుకు ఢాకిని మద్రాసు తీస్కుపోయి అక్కడ మూల్న పడ్డ బస్సును కొనిపించి రిపేర్లు చేయించి తీసుకొచ్చాడు.