
UNNAVA RAJAGOPALAKRISHNAIAH
₹100
In stock · 51 available
PublisherG.VENKATA RAMARAO
LanguageTelugu
మా మాట ఉన్నవ రాజగోపాలకృష్ణయ్యగారు మా పిన తండ్రిగారు. ఉన్నవ వెంకటరామయ్య గారు మా తండ్రిగారు. ఇద్దరూ నిఖార్సయిన జాతీయ వాదులే. జీవిత పర్యంతం శుద్ధ గాంధేయవాదులు. దేశ సేవలో లబ్ధ ప్రతిష్ఠులు. వెంకటరామయ్యగారు 'నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ'ల రూప శిల్పి, రాజగోపాల కృష్ణయ్యగారు హిందీ ఉద్యమ నేతగా 40 సంవత్సరములు విశేష సేవ చేసినటువంటివారు. వీరిని సన్నిహితంగా తెలిసినవారు రామలక్ష్మణులతో పోలుస్తారు. మా మిత్రులు కొంతమంది "ఉన్నవ సోదరులు"గా ప్రసిద్ధి చెందిన వీరి జీవిత చరిత్రలు వెలువరించరాదా అని సూచించినారు. మా పిన తండ్రిగారి జీవిత చరిత్ర వ్రాయటానికి చాలా సమాచారం లభించింది. ఈ సమాచారం మా పిన తండ్రిగారి జీవిత చరిత్ర వ్రాయటానికి సరిపోతుందని అనుకున్నాము. కాని మాకు రచనా వ్యాసంగంలో ఎక్కువ అనుభవం లేదు. అందుకని జీవిత చరిత్రలు వ్రాయటంలో సిద్ధ హస్తులైన శ్రీ జి.వెంకటరామారావుగారిని ఈ ఇద్దరి జీవిత చరిత్రలు వ్రాయమని కోరాము. వారు మా కోరికను మన్నించారు. మా పిన తండ్రిగారు తన జీవితం ప్రారంభం నుంచి ముఖ్యమైన ఘట్టాలను ఫోటోల రూపంలోను, వార్తా పత్రికల క్లిప్పింగ్స్ రూపంలోను, సన్మాన పత్రాల రూపంలోను, అభినందన గ్రంథాల రూపంలోను, భద్రపరచుకున్నారు. వీరి జీవిత చరిత్ర వ్రాయటానికి తగిన విషయ సేకరణ విషయంలో మాకు పెద్దగా శ్రమ కలుగలేదు. మా పిన తండ్రిగారికి సంతానం లేదు. ఆయన సంపన్నుడు కాదు. కాని పొదుపరి. తనకు వచ్చిన జీతంలో కొంత సొమ్ము పొదుపు చేసుకొని, ఆ పొదుపు చేసుకున్న ధనంలో నుంచి తన పెద్దన్న పేరయ్యగారి పిల్లలను, తన చిన్నన్న వెంకటరామయ్యగారి పిల్లలైన మమ్ములను చదివించి, పోషించి మా అభ్యున్నతికి ఎంతో ఉదారంగా సహాయపడి మా ఎదుగుదలకు దోహదకారి అయినారు. తనకు పిల్లలు లేరనే భావన రాకుండా మేము కూడా ఎంతో ప్రేమతో చూసుకున్నాము.