
VADDEPALLI ROOPAKALU
₹120
In stock · 5 available
PublisherVADDEPALLI KRISHNA
LanguageTelugu
డా॥ వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో 1949లో వడ్డేపల్లి లక్ష్మమ్మ, లింగయ్య దంపతులకు జన్మించారు. సహస్రాధిక లలితగీత / ద్విశతాధిక సినీ గీత రచయితగా, ప్రామాణిక పరిశోధకునిగానే గాక అనేక టి.వి. ధారావాహికలకు, కొన్ని సినిమాలకు రచనతో పాటు ప్రతిభావంతంగా దర్శకత్వం నిర్వహించారు. డా॥ సి.నా.రెగారి స్ఫూర్తితో అన్ని సాహిత్య ప్రక్రియల్ని పండించారు. ఇంతవరకు 30 కావ్యాల్ని, 60 ఆడియో ఆల్బమ్లను వెలువరించారు. 10 నాటిక, నాటకాల్ని, 52 సంగీత, నృత్య రూపకాల్ని, 90 టీవీ ధారావాహికల్ని రచించారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు. 19 డాక్యుమెంటరీలను రూపొందించారు. 2005లో సెన్సార్ బోర్డ్ సభ్యునిగానే గాక, 2003లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి, 2010లో బాలల నంది నాటకాలకు న్యాయనిర్ణేతగా నిలిచి, నిష్పక్షపాతంగా తీర్పునిచ్చారు. 2006 & 2009లో నంది అవార్డుల కమిటీలకు ఛైర్మన్గా వ్యవహరించారు. ఆకాశవాణి ద్వారా అన్ని రాష్ట్రాల్లో అనువాదాలతో వీరి లలితగీతం సెప్టెంబర్ 1995లో నెలంతా జాతీయస్థాయిలో ప్రసారం కావడం విశేషం. 'ఎన్టీఆర్' (1987) మొదలిడి అందరు ముఖ్యమంత్రులచే, మాజీ ప్రధాని వాజ్పాయ్ (1996) గారిచే కవి సత్కారం పొందడం విశిష్టం! 'చిరుగజ్జెలు' (బాలల గేయాలు), 'వడ్డేపల్లి గేయవల్లి' (లలితగీతాలు) కావ్యాలకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాల్ని పొంది, స్వదేశ - విదేశాల్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కవితా ప్రతిభతో ప్రకాశించి, జాతీయ- అంతర్జాతీయ కవిగా ఖ్యాతిగాంచారు. 'చెట్లు' మొదలగు వీరి పాటలు పూణె బాలభారతి తెలుగు వాచకాల్లో పాఠాలుగా నిలవడం గర్వకారణం! వీరు ఇటీవల 60 యేళ్ల తెలంగాణ సంఘర్షణ సాధనను 60 నిమిషాల నిడివి గల "జయ జయహే తెలంగాణ' (సంగీత నృత్య రూపకం)ను రచించగా, అది డా|| కె. వి. రమణగారి ప్రోత్సాహంతో అన్ని జిల్లాల్లో ప్రదర్శింపబడడం అభినందనీయం! ఇందలి కొన్ని రూపకాలు అమెరికాలో కూడా ప్రదర్శితమై, ప్రజాదరణ పొందడం ప్రశంసనీయం. చారిత్రక నేపథ్యమైన 'భాగ్యనగర్' నాటకాన్ని రచించగా, 'సత్కళాభారతి'చే పలుమార్లు ప్రదర్శితమై ప్రశంసల్ని పొందడం శ్లాఘనీయం! బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన డా॥ వడ్డేపల్లి కృష్ణ నిత్య సాహితీ కృషీవలుడు! 1968 నుంచి ఇప్పటివరకు నిరంతరంగా రచనలు కొనసాగిస్తున్న అభ్యుదయ భావ తపోధనుడు!