
VALLAMPATI NAVALALU INDRADHANASSU
₹125
In stock · 120 available
PublisherVALLAMPATI PRACHURANALU
LanguageTelugu
"ఆకాశం వలెనే మానవ జీవితం కూడా రంగులు మార్చుకొంటుంది. రెండిటిలోను అనంతమైన వైవిధ్యం ఉన్నది; ఒక క్రమం ఉన్నట్లు తోచదు. అశాశ్వతత్వంలో శాశ్వతత్వం నిహితమై ఉన్నది" వేకువ జాము రైలుకు ఉమాపతి బావ వస్తాడని తెలియగానే శారదకు ఆరాత్రి నిద్ర రాలేదు. అనేక రకాల భావాలు మంచివి, చెడ్డవి; తియ్యనివి, చేదువి తెరలు తెరలుగా ఆ లేత మనస్సులోకి తొంగి చూడటం ప్రారంభించాయి. తెల్లవారి, తెల్లవారకముందే ఉమాపతి బావ వస్తాడు. వచ్చీ రాకముందే తనకోసం వెదుకుతాడు. తాను కనపడీ కనపడకముందే ఎవ్వరూ చూడకుండా తన కేదో యిస్తాడు. తాను ఎన్నోసార్లు తీసుకోకూడదనుకొంది. కానీ, ఉందిగా అమ్మ మారెమ్మ - ఏ తలుపు సందులోనుంచో తీసుకోమని సైగ చేస్తుంది. తాను తీసుకొంటుంది. బావ వెళ్లగానే అమ్మ వచ్చి, 'బుద్ధి లేదూ?' అంటుంది. “ఎవరికి?” తన ప్రశ్న. "నీకే! లేకుంటే నాకనుకున్నావా?' ఔనన్నట్టుగా తను తల ఊపుతుంది. ఆకలిగొన్న పులిలా చూచి ఆమె వెడుతుంది. బావ వచ్చిన ఐదు నిమిషాల్లో మామూలుగా జరిగే తతంగ మిది. శారద రాత్రల్లా ఇలా ఆలోచిస్తూనే ఉంది. అందులో అది పుష్యమాసపు రాత్రి! పుష్యమాసంలో పగలు ఎంత కురచో రాత్రి అంత పొడుగు! శారద ఎంత ఆలోచించినా ఆ రాత్రి తరగలేదు. శారద ఏమీ తోచక తలుపు తీసుకొని పెరట్లోకి వచ్చింది. తలుపు తీసీ తియ్యగానే చలిగాలి కొరడా కొనలా తాకింది. శారద శరీరంతో బాటు మనసు గూడా జిల్లు మంది చలిగాలి తాకిడికి. కొంగుతీసి బాగా కప్పుకొని పెరట్లోకి వచ్చింది. పెరట్లో ఉన్న సన్నజాజి పందరిని పొగమంచు కౌగలించుకొంది. ఎత్తుగా నిల్చున్న బాదంచెట్టు మీద చీకటి కుండపోతగా కురుస్తుంది. వల్లంపాటి నవలలు