
VANCHITULU - KATHALA SAMPUTI
₹150
In stock · 40 available
PublisherANDHRAPRADESH ABHYUDAYA RACHAITHALA SANGAM
LanguageTelugu
ISBN9788198338563
పంజరం వెంటిలేటరు నుండి దూసుకొస్తున్న సూర్యుని లేత ఎరుపుకిరణాలు మెల్లగా తిరుగుతున్న ఫేసురెక్కల మీద పడి మెల్లగా పరావర్తనం చెంది గదిలో వింతగా మెరుస్తుంటే. నషన్ పరుపుమీద వెల్లకిలా పడుకొని ఆసక్తిగా గమనిస్తున్నాడు రాజారావు. కొద్ది నిమిషాల అనంతరం సూర్య కిరణాల కోణం మారడంతో మసక కాంతి కొంత గదిలో అలుముకొంది. బెడ్మీద ఎంతోసేపట్నుండి పడుకొని ఉండటంవలన విసుగనిపించి లేచి కిటికీ దిగ్గరగా నడిచి కుషన్ కుర్చీలో కూర్చున్నాడు. అస్తమిస్తున్న ఎర్రటి సూర్యబింబం పశ్చిమాద్రి నుదుటిపై అద్దిన ఎర్రటి కుంకుమ బొట్టులా వుంది. క్రమేపి కుచించుకుపోతున్న సూర్యుణ్ని, ఎర్రని రంగు చిలికినట్లున్న పశ్చిమ ఆకాశాన్ని తదేకంగా గమనిస్తుండిపోయాడు. అప్పుడే అస్తమించిన సూర్య కిరణాలు కుంచల్లా మబ్బుతునకల్ని తాకి ఆకాశపు కాన్వాసుపై వివిధ రంగుల్లో అద్భుత దృశ్యాల్ని చిత్రిస్తుంటే పరవశం కలిగింది. అస్తమించినా తన కిరణ ప్రభావంతో ప్రకృతిని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్న సూర్యుడు ఎంత గొప్పవాడు? రాజారావు ప్రశ్నించుకొన్నాడు. తన అస్తమయానికి ఇంతటి శోభ ఎలా చేకూరుతుంది? చల్లని గాలికి మంచు బిందువులా మారి వేడికి కరిగి పోయే నీటిచుక్కకు స్థిరత్వం ఎక్కడుంది? సూర్యకిరణం తాకగానే కరిగే మంచుబిందువులాంటివాడు తను. తన జీవితోదయం నుండి నేటివరకు తనెవరికి ఉపయోగపడ్డాడు? భారంగా నిట్టూర్చాడు. చంద్రుడు సూర్యకిరణాల ఉనికితో ప్రభావితుడై ఎలా ప్రకాశిస్తాడో, ముప్పయి సంవత్సరాల తర్వాత తెలిసిన రాజేంద్ర ఉనికి తన హృదయాన్నంతగా ప్రభావితం చేసింది. వారం క్రితం తను వ్రాసిన ఉత్తరం రాజేంద్రకు అందేవుంటుంది. వెంటనే వచ్చి తనను కలసుకోమన్న అభ్యర్ధన రాజేంద్ర మన్నిస్తాడా?.... ఏమో? తన ఆవేదనను, దుఃఖాన్ని విప్పిచెప్పుకోవటానికి ఇప్పుడు అతనుకాక మరెవరు ఉన్నారు? ఎందుకనో, రాజేంద్ర తప్పక వస్తాడనే ఆశ తనకుంది.