
VASTU BHAVISHYAT GEETHA
by PULLARAO
₹120
In stock · 3 available
PublisherPULLARAO
LanguageTelugu
అనుభవజనిత వాస్తుజ్ఞానం లో అంతా మంచే జరిగినంతకాలం ఎవరికి వారు అది తమ ఘనతే అనుకొంటారు. అలాగే చాటుకొంటారు. పరమానందం చెందుతారు. కాని, ఎప్పుడైన జరగకూడనిది జరిగితే అప్పుడు స్పందన మరొకరకంగా ఉంటుంది. కొందరు "అంతా మా కర్మ" అంటారు. మరి కొందరు “ప్స్! గ్రహస్థితి అనుకూలంగా లేదు, ఏం చేస్తాం" అని పెదవి విరుస్తారు. ఇంకా కొందరు దేవుణ్ణి తిట్టిపోస్తారు. కాని ఇప్పుడు మనచేతుల్లో ఉన్న పుస్తకం రచయిత పుల్లారావుగారు “ఇంటి వాస్తు అలా ఉంది. మంచి మార్పు జరగమంటే ఎలా జరుగుతుంది? వాస్తు సరిచేసుకోండి. మంచి మార్పు ఎలా వస్తుందో మీకు మీరే అనుభవం మీద తెలుసుకొంటారు!" అని బల్లగుద్ది మరీ చెబుతారు. పుస్తకం మొత్తం చదివితే మీకు కూడా ఇంచుమించు ఇలాంటి అభిప్రాయమే ఏర్పడుతుంది. పుల్లారావు గారు ఏవో పాత సంస్కృత గ్రంథాలు నాలుగు చదివి రాసింది కాదిది. ప్రాచీన గ్రంథాలను ఆయన చదవలేదని కాదు. నిస్సందేహంగా చదివారు. కాని, అంతకుమించి, స్వయంగా అధ్యయనం చేసి పొందిన జ్ఞానం, జీవితంలో కలిగిన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలు ఆయనను వాస్తు శాస్త్ర నిపుణుడిని కావించాయని నాకు అనిపిస్తుంది. ఒక మహనీయురాలు చెప్పినట్లు అనుభవం నుంచి వచ్చినదే గదా శాస్త్రం! ప్రాచీన కాలంలో దివ్యజ్ఞాన సంపన్నులైన మహర్షులు చెప్పిన శాస్త్రవిషయాలను పుల్లారావుగారు తన అనుభవాల నేపథ్యంలో అవగాహన చేసుకొని, వర్తమానానికి అన్వయింపచేసి, కొన్ని సిద్ధాంతాలు చేశారు. తిరుగులేని విశ్వాసాలు ఆయనకు ఏర్పడ్డాయి. ఆయన అధ్యయనం, అనుభవం, అవగాహనల సమాహారమే ఈ గ్రంథంగా రూపుదిద్దుకొన్నది. రచయిత అనుభవ జనిత జ్ఞానానికి ఒక ఉదాహరణ. భోజరాజకృతంగా ప్రసిద్ధిలోకి వచ్చిన "సమరాంగణ సూత్రధారము” ఇంకా "విశ్వకర్మ ప్రకాశిక”, “నారద శిల్పము" మొదలైన గ్రంథాలు ప్రాచీన “వాస్తు” విజ్ఞాన సూత్రాలను తెలియజేస్తున్నాయి. వాటిలో కొన్ని ఇల్లు కట్టేటప్పుడు ఇంటి ముందు, ఇంటి వెనుక సమానంగా ఖాళీస్థలం వదలాలని చెపుతాయి. కాని ఇందులో సాధకబాధకాలు కొన్ని ఉన్నాయి.