
VEDANTHA VIGNANA VEECHIKALU PHASE - 3
₹25
In stock · 2 available
PublisherAMMU ANNAJEERAO
LanguageTelugu
“జీవుడంటే” కఠోపనిషత్ అనే గ్రంథంలో నచికేతుడు యమధర్మరాజును ఈ ప్రశ్నే అడుగుతాడు. “అస్తీత్యేకే నాయమస్తీతిచైకే" అని అంటే "అయ్యా! మా లోకంలో ఆత్మ ఉన్నదని ఒకరు, లేదని ఇంకొకరు అంటున్నారు. నిజమేమిటో సెలవియ్యండి” అని అర్థం. మనం అంటూవుంటాం "ఆయన వెళ్ళిపోయాడు”. అని, ఈ వెళ్ళిపోవటమంటే మరణించటమనే మన అర్థం! మరి మరణించినదెవరు? రామారావు అనో, కృష్ణారావు అనో ఏదో ఒక పేరు గల వ్యక్తి వున్నాడనుకోండి. ఆ వ్యక్తి నీవు శరీరాన్ని బట్టే గుర్తిస్తున్నావు. శరీరానికి భిన్నంగా అలాంటి వ్యక్తిని నీవు చూడడంలేదు. ఈ శరీరంలోపల జీవుడున్నాడు. వానిని గూర్చే నీవు మాట్లాడుతున్నావు అని శాస్త్రం చెప్పినా అది మన కంతగా తలకెక్కదు. మనం జీవుడు, ఆత్మ అనే రెండు మాటలూ ఒకే అర్థంలో వాడుతున్నాము. కానీ వేదాంతంలో “ఆత్మ” అనే మాట ఈ అర్థంలోనే కాక, ఇంకా చాలా అర్థాలలో వాడబడింది. ఇక్కడ ప్రస్తావించేది వేదాంత విషయమే. సందర్భం వచ్చింది గనుక అసలు వేదాంతమనే మాటకు అర్థమేమిటో తెలుసుకుందాం. వేదాంతము అంటే "వేదము యొక్క నిర్ణయం" అని అర్థం. ఏ విషయములో? అంటే పరమసత్య విషయములో అని సమాధానం. ఏమిటి ఆ పరమసత్యం అంటే పరమాత్మయే పరమసత్యం అని! మరి ఈ కనిపించే ప్రపంచం, జీవులూ, ఇవన్నీ అంతా అసత్యమే అంటే, ఉన్నది ఒకే ఆత్మ! ఇదియే బ్రహ్మ, రెండవ వస్తునంటూ ఏదీలేదు. అన్నదే సారాంశం. ఉన్నది ఒకే పదార్థం, అదియే బ్రహ్మ పరమాత్మ, ఆ బ్రహ్మయే ఆత్మ! ఈ కనిపించే ప్రపంచమంతా అసత్యమే. అజ్ఞానం వల్ల ఆ బ్రహ్మయే ఈ ప్రపంచమంతా గోచరిస్తున్నాడు. జీవుడు అనే వాడు గూడా ఆ బ్రహ్మ స్వరూపమే. సమస్త ప్రాణుల యొక్క అంతరంగంలో ఆ బ్రహ్మ ప్రతిబింబిస్తున్నాడు. జ్ఞానస్వరూపుడైన బ్రహ్మ గనుక ఆ ప్రతిబింబానికి కూడా జ్ఞానం కలిగి “నేను” అన్న విథంగా జీవుడై అజ్ఞానంచే ఆదరింపబడి కర్మలు చేస్తూ, కర్మఫలాన్ని పొందుతూ సంసారబంధంలో చిక్కుకొని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. వేదాంత విచారం చేత ఆత్మజ్ఞానం పొంది "నేను జీవుడను గాని, బ్రహ్మనై యున్నాను” అని నిశ్చయించుకొన్నప్పుడు సర్వసంసార బంధాలనుండి విముక్తుడై శాశ్వతనందమును పొందుతాడు. ఇదే సమస్త వేదాంత సారం !!