
VEMANA VEMANAPAI VIMARSHANA VYASALU - 160
by C.VENKATESH
₹160
In stock · 6 available
PublisherC.P.BROWN ACADEMY
LanguageTelugu
వేమన భావనాశక్తియనఁగా విషయముల మనసులోఁ బ్రతిబింబించునట్లు చేయు సామర్థ్యము. ఒక్క ప్రతిబింబించుటయననేల! ప్రత్యక్షముగ నవతారమెత్తునట్లు చేయుట. చూడుఁడు. సీత, ద్రౌపది, సావిత్రి, దమయంతి, శూర్పణఖ మొదలగు స్త్రీలు కవికల్పనమునకుఁ జేరినవారయ్యును మనకుఁ జరిత్రములలోని స్త్రీలకంటెను, మఱియు మనము నిత్యమును జూచుచు వాదాడుచునున్న యిరుగుపొరుగు భాగ్య శాలినుల కన్నను నెన్నియో మడుంగులు సత్త్వముందాల్చినవారై స్ఫురించుచున్నారు గదా! చూడంబోయినఁ బాండవులు, దుర్యోధనాదులు, రామభరతులు మొదలగు మనస్సృష్టి మానవులు మిథ్యలా? మనమె మిథ్యలా? ఈ తీరునఁ గృత్రిమముల సయితము మూర్తీభవింపఁ జేయువారే మహాకవులు. అట్టివారు వ్యాకరణమునకు భంగము గలిగించిననేమి? వచనమున వ్రాసిననేమి? వారి కేకొదువయు రాఁ బోదు. వ్యాకరణము యతిప్రాసములు అన్నియుఁ దప్పక కుదిరినను భావనాశక్తి లేనియెడల నట్టి పాండిత్యము జీవములేని యాకారము బలె జడంబుగఁ గాన్పించును. ప్రతిమలు వ్రాయుటలో బహుసమర్థుఁడైన యొక శిల్పివర్యునియెడకు, చిల్లర శిల్పియొకఁడు పోయి తన లిఖించిన చిత్రపటముంజూపి, “దీనియందేమైన దోషములున్నవా?" యని ప్రార్థింపుడు నాతండిట్లనియె "అయ్యా! గీఁతలు వర్ణములు మొదలగు గుణములన్నియుఁ జక్కగ గుదిరి యున్నవి కాని, యీ సుందర విగ్రహమునకుఁ బ్రాణములే యున్నట్టు గానమే!". అది విని “యేరీతిని దిద్దిన దీనికిఁ జైతన్యమబ్బును తెలుపవే మహాత్మా!" యని యావిద్యార్థి దీనుఁడయి వేడుఁ డు, "అయ్యా! నీ చింతఁ దీర్పనావలనఁగాదు. నీయడిగిన వరంబు సాజమైన భావనాశక్తిచే లభ్యము. ఇట్టిట్లు చిత్రించుటచే ఘనుఁడవగుదువని చెప్పి చేయించుటలో ఫలములేదు.