
VENNELA VESAVI
by ARUDRA
₹25
In stock · 227 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట ఇది "కళింగత్తుపరణి" అనే తమిళ కావ్యంలోని రెండు ప్రకరణాలకు అనువాదం, అరవభాషలో "పరణి” అంటే వీర ప్రబంధమని అర్ధం. ఇది మొదటి కులోత్తుంగ చోళుని కళింగ విజయాన్ని కీర్తిస్తుంది. నన్నయ్యగారిచేత మహాభారతాన్ని ఆంధ్రీకరింపచేసిన రాజరాజనరేంద్రుని కుమారుడే మొదటి కులోత్తుంగ చోళుడు. గోదావరీ తీరాన రాజమహేంద్రవరం రాజధానిగా తండ్రి పరిపాలించినా, కుమారుడు తమిళదేశంలో స్థిరపడి చోళ సామ్రాజ్యానికి కూడా చక్రవర్తి అయ్యాడు. దీనికి ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. రాజరాజనరేంద్రుని మాతామహుడు చోళచక్రవర్తి; రాజరాజు భార్యకూడా చోళరాజకన్య. ఆమె పేరు అమ్మంగదేవి. వీరిద్దరికీ జన్మించిన కుమారుని పేరు రాజేంద్రుడు. ఇతడే ఉత్తరోత్తరా కులోత్తుంగ చోళుడనే పేరుతో ప్రసిద్దికెక్కాడు. ఇతడు చిన్నప్పటి నుండీ చోళరాజధానిలో మాతామహుల యింటనే పెరిగాడు. అందుచేత ఆ దేశమన్నా ఆ భాషన్నా అతనికి ఆదరం హెచ్చింది. అతడు వివాహం చేసుకొన్నది కూడా తమిళ కన్యలనే. పాత చుట్టరికాలవల్లా, పెళ్ళి సంబంధాలవల్లా ఇతనికి కావేరి నుంచి కళింగందాకా వుండే మహాసామ్రాజ్యం సంక్రమించింది. తండ్రి తరఫున చాళుక్యుడైనా తాను చోళుణ్ణని ప్రకటించుకొన్నాడు. తమిళ దేశంలో వుండే రాజధానిలో వుంటూ పాలించాడు. తాను ప్రత్యక్షంగా పరిపాలించడానికి వీలులేదు కనుక, కులోత్తుంగ చోళుడు తెలుగు దేశాన్ని ఏలడానికి రాజప్రతినిధులుగా తన కుమారులను పంపేవాడు. ఒక్కొక్కడూ ఒక రెండుమూడేళ్ళు పాలించాక అతడిని రాజధానికి పిలిపించి వేరొక కుమారుణ్ణి నియమించేవాడు. కులోత్తుంగ చోళుడు క్రీ.శ. 1070 లో రాజ్యానికి వచ్చాకు. సింహాసన మెక్కిన 33 వ యేట కళింగంపై దండయాత్ర చేసినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ వృత్తాంతాలనే తీసుకుని కులోత్తుంగుని ఆస్థానకవి "జయంగొండాన్" ఈ కావ్యాన్ని రచించాడు. ఈ "పరణి” ప్రకారం కళింగ దండయాత్రని నడిపించినవాడు కులోత్తుంగుడు కాక అతని మంత్రీ దండనాధుడూ అయిన కరుణాకర తొండమాను. పరణి కథా వృత్తాంతం గురించి శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు తెలుగు భాషా సమితివారు ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం మూడవ సంపుటిలో ఇలా వ్రాశారు : "ఉత్తర కళింగాధిపతి ఏటేట చెల్లింపవలసిన కప్పమును చెల్లింపలేదనియు, ఇట్లు చెల్లింపక పోవుట రెండవ తడవ యనియు మంత్రులు విన్నవింపగా కులోత్తుంగుడు కళింగములోని దుర్గములను ముట్టడించి పట్టుకొని తద్దేశాధిపతిని బందీగా గొనివచ్చుటకు కళింగముపై దాడి సేయ నియమించెననియు పరణి తెలుపుచున్నది. చక్రవర్తి యాజ్ఞను శిరసావహించి నెరవేర్చుటకు తాంబూలము పుచ్చుకొన్నవాడు పండువరాజను కరుణాకర తొండమాను. ఇతనికి పల్లవరాజని నామాంతరము. ఇతడు దండును గూర్చుకొని కంచీపురము నుండి బయలుదేరి కతిపయ ప్రయాణముల దారిలో పాలేరు పొన్ముఖరి (స్వర్ణముఖి), పెన్న, మన్నేరు, కృష్ణ, గోదావరి, పంప, గౌతమి నదులను దాటి కళింగమును చేరెను. అంతట చోళ సైన్యములు గ్రామములను తగులబెట్టి దేశమును విద్వంసము