
VEYYINNOKKA NAVALALA KOVVALI - JEEVITHAM SAHITYAM
₹40
In stock · 35 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
ముందుగా మూడు ముక్కలు మన తెలుగు సాహిత్యంలో ఎంతగానో కృషిచేసిన కొందరు మహానుభావులకు సరైన గుర్తింపు రాలేదు. గుర్తింపు రాలేదంటే ముందు తరాలవాళ్ళకు సరిగ్గా చేరలేదు. ఈ తరంవాళ్ళు వాళ్ళ సేవల్ని సరిగ్గా గుర్తుపెట్టుకోలేదు. ఇంకొందర్ని సరిగ్గా గుర్తుపెట్టుకోలేదు సరికదా-వ్యతిరేక ప్రచారం జరిగింది. పాలగుమ్మి పద్మరాజుగారన్నట్లు-ప్రతీ వ్యక్తి జీవితంలో రెండు తేదీలు ముఖ్యం. విచిత్రమేమిటంటే ఆ రెండు తేదీలు అతనికి తెలీదు. నువ్వు భలాన రోజు ఇన్ని గంటలకు పుట్టావని పెద్దవాళ్ళు చెబితే ఔననుకుంటారు. ఎప్పుడు మరణించేది తెలీదు. మరణం తర్వాత అతని జీవితం చరిత్రవుతుంది. చరిత్రలో అతను లేక ఆమె చేసిన పనుల్ని సమీక్షించగలం. అందుకని ఓ వ్యక్తి చేసిన పనుల్ని సమకాలీనుల కన్నా తర్వాతి తరంవాళ్ళు బాగా అర్థం చేసుకోగలరు. అలా శతజయంతి జరుపుకున్న కొవ్వలి వారిని అర్ధం చేసుకొని చెప్పడానికి చేసిన చిరు ప్రయత్నమే ఈ చిరు గ్రంథం. కొవ్వలి వారి కాలంలో గ్రాంథిక భాష రాజ్యమేలుతోంది. అందరూ ఈ గ్రంథ భాష-వాడుక భాష అయితేనే చదవగలరు. ఆరోజుల్లో వాడుక భాషలో రాయడమంటే ఏటికి ఎదురీదడమే! అంతే కాదు సాహిత్య వస్తువు-సమాజంలో ఉన్నతస్థాయి వాళ్లు. మధ్యతరగతివాళ్ళ గురించి-ముఖ్యంగా స్త్రీల సాధక బాధకాలను చర్చించాలంటే - అది సాహసమే. ఆ సాహసాన్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాల్సి వచ్చింది. ట్రెండ్ సెట్టర్స్కి ఇలాంటి బాధలు తప్పవు. ఎందుకంటే అంతవరకూ ఉన్న పద్ధతుల్ని వీళ్ళు ఒక్కసారిగా తోసిరాజంటున్నారు. గురజాడ, గిడుగు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిలాంటి ప్రముఖుల అడుగుజాడ లలోనే నడిచి కొవ్వలి తమ వంతు విజయాన్ని సాధించారు. తెలుగువాళ్ళలో పఠనాశక్తిని పెంచారు. తెలుగు పాఠకుల్ని పంచారు. ఈ విజయాలు చాలు ఆయన గురించి చెప్పుకోవడానికి. అలాంటి మహనీయుడి పట్ల కొందరికున్న అపోహల్ని తొలగించాలన్నది కూడా ఈ రేఖాచిత్ర రచన వెనుక తహతహ. వ్యావహారిక భాష గురజాడ, గిడుగులాంటి వారి తీవ్ర ప్రయత్నాలతో ఉత్తరాంధ్రలో ప్రారంభమైనా-క్రమంగా ఆంధ్రప్రదేశ్ అంతటా దావానలంలా వ్యాపించింది. విచిత్రమేమిటంటే రాజమహేంద్రవరం-గోదావరి ఒడ్డున ప్రాచీన సాహిత్యం పుట్టి తన ప్రాభవాన్ని చూపించింది. ఆధునిక సాహిత్యం కూడా అక్కడే ఉవ్వెత్తున లేచింది. అందుకు కారణాలలో గిడుగు రామమూర్తిగారు పర్లాకిమిడి నుంచి రాజమహేంద్రవారానికి చేరుకోవడం ఒకటి.