
VISALAANDHRA SAMPADAKA VARGAMLO 50 YELLA ANUBHAVALU - GNAPAKALU
₹50
In stock · 81 available
PublisherSANGHAMITRA PUBLICATIONS
LanguageTelugu
మొదటి భాగం తెలుగునాట కమ్యూనిస్టు జర్నలిజానికి పితామహులు శ్రీ చంద్రం శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు 1907లో కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా, వెంట్రప్రగడలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి పేరు సుబ్బయ్య, తల్లి పేరు పూర్ణమ్మ. వీరికి ముగ్గురు సోదరులు, ఒక సోదరి. వెంట్రప్రగడలో స్కూల్ ఫైనల్ వరకు చదివారు. తర్వాత బందరులోని జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. జాతీయోద్యమంలో 1929లో గాంధీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన చేసిన జాతీయోద్యమ ప్రబోధంతో ఉత్తేజితులై 1930 ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో అరెస్టయి పామర్రు మేజిస్ట్రేటు కోర్టులో 3 నెలలు కఠినశిక్ష విధించబడి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపబడ్డారు. జైలునుండి విడుదలైన తర్వాత విదేశ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1928లోనే సైమన్ కమిషన్ కు నల్లజెండాలు చూపేందుకు యువకులను సమీకరించారు. 1932 ఏప్రిల్లో వ్యష్టి సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో రహస్య కరపత్రాలు ప్రచురించటం ప్రారంభించారు. దాంతో వెంట్రప్రగడలో తిష్టవేసిన ప్యునిటివ్ స్క్వాడ్ గ్రామం మొత్తానికి జరిమానాలు వేస్తూ, ఆయనను పట్టివ్వమని పోరుపెట్టాయి. ఎవరూ పట్టివ్వలేదు. మొత్తంమీద బుడమేరు పాయలలో ఆయనను పట్టుకొని వైట్ సార్జెంట్ (యూరోపియన్ కెప్టెన్) రహస్యాలు బైటపెట్టమని బాధించి, నోటివెంట నురుగు, రక్తం కక్కేదాకా చిత్రహింసలు పెట్టారు. ఆ విషయం తెలిసిన 'మిసెస్ కెప్టెన్' ఆయనను తీసుకెళ్ళి చికిత్స చేయించారు. అనంతరం గుడివాడ డిప్యూటీ కలెక్టరు రెండేళ్ళ కఠినశిక్ష, జరిమానాలు విధించారు. తిరిగి రాజమండ్రి, అటుపిమ్మట బళ్ళారి జైలుకు పంపబడ్డారు. 1933 అక్టోబరులో గాంధీజీ హరిజనోద్యమ సందర్భంలో ఉపవాసం జరుపుతున్న సందర్భంలో, జైలు నుండి విడుదలయ్యారు. హరిజన సేవక్ సంఘాలలో పనిచేసి హరిజనుల దేవాలయ ప్రవేశానికి కృషి చేశారు.