
VOL 11-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM - NAVALALU
₹180
In stock · 176 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నిశాగీతం "మీ అమ్మాయికి జబ్బేమిటమ్మా?" లావుపాటి ఆవిడ అదే బెంచీమీద కూర్చునివున్న సన్నపాటి స్త్రీని ప్రశ్నించింది. ఆ స్త్రీ కనుబొమ్మలు చిట్లించి లావుపాటి ఆమెను చూసింది. "మీ అమ్మాయేనా ? ఏమిటి జబ్బు?" మళ్ళీ అడిగింది ఈమె. "ఏo జబ్బా! ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఏం జబ్బో అదే! మీ అబ్బాయి జబ్బే. మా అమ్మాయి జబ్బు" చురుగ్గా సమాధానం ఇచ్చింది ఆమె. లావుపాటి ఆవిడ పక్కగా కూర్చుని వున్న యువకుడు తలతిప్పి చూశాడు. అదోలా తనలోతానే నవ్వుకున్నాడు. లావుపాటి ఆవిడ మరోప్రశ్న వెయ్యలేదు. కాని ముఖం కందగడ్డలా అయింది. ఉన్నట్టుండి ఎదురు బెంచీమీద ఇద్దరు నడివయస్కుల మధ్య కూర్చుని ఉన్న యువకుడు చివ్వున లేచి నిల్చున్నాడు. అతడి ఇరుప్రక్కల ఉన్న పెద్దమనుషులు లేచి ఆ యువకుడి చెరో రెక్కా పట్టుకున్నారు. "బాబూ! కూర్చో! డాక్టరుగారు వచ్చేవేళయింది" అన్నాడు ఒకడు. ఇద్దరూ కలిసి ఆ యువకుడ్ని కూర్చోపెట్టడానికి ప్రయత్నించారు. కాని ఆ యువకుడు కాళ్ళను భూమిమీద తాటించి బిర్రబిగిసిపోయి పాతేసిన కట్టుకొయ్యలా నిల్చున్నాడు! అతడి ఇరువైపుల ఉన్న పెద్ద మనుషులు ఎంత బ్రతిమాలినా, అతడిలో చలనం ఏమాత్రం కన్పించలేదు. అతడి చేతులు వదిలేసి, వాళ్ళిద్దరూ యుద్ధంలో ఓడిపోయిన సిపాయిల్లా బెంచీమీద కూలబడ్డారు ఎదురు బెంచీ మీద కూర్చునివున్న లావుపాటి ఆవిడ ఇదంతా చోద్యంగా చూస్తున్నది. ఆవిడ పేరు మంగతాయారు. "మీరు ఆ అబ్బాయికి ఏమౌతారు?" మంగతాయారు ప్రశ్నించింది. "నా కొడుకు. ఈయన మా ఇంట్లో అద్దెకు వుంటున్నాడు" ఒక వ్యక్తి సమాధానం ఇచ్చి నిట్టూర్పు విడిచాడు. అతడి పేరు రాఘవరావు. "మీ అబ్బాయి పేరు?" మంగతాయారు అడిగింది. "రఘురాం" అని మంగతాయారు పక్కనే కూర్చునివున్న యువకుడి కేసి జాలిగా చూశాడు. "మీ అబ్బాయికీ జబ్బు ఎంతకాలంనుంచీ?" అడిగాడు మంగతాయారును. "నా ఖర్మ... ఇటీవలే వాడ్ని ఈ జబ్బు పట్టుకుంది. వాడు తనకు జబ్బేంలేదని నాకే జబ్బనీ అంటాడు." "ఈ జబ్బుకున్న లక్షణమే ఇది" అన్నాడు రాఘవరావు. "అమ్మా! మాట్లాడకుండా కూర్చో!" విసుక్కునాడు మంగతాయారు పక్కనే కూర్చునివున్న యువకుడు. "ఇదండీ వరస" ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అన్నది మంగతాయారు. దా॥ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం-11 (నవలలు)