VOL 3-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM-KATHALU by DR.VASIREDDY SEETHADEVI Telugu book cover

VOL 3-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM-KATHALU

by DR.VASIREDDY SEETHADEVI

₹150
In stock · 381 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పానీ ఆ రహా హై ఈ ప్రకారంబుగా...శివకేశ్ బంధిత అయిన గంగాభవాని భువికి దిగుతున్న సమయంబున భగీ రధుని మనస్సు ఎలాగున్నదయ్యా అంటే.... కంచుగంటలా మ్రోగుతున్న శంకరశాస్త్రి కంఠం అకస్మాత్తుగా ఆగిపోయింది. నల్లకుంటలోని శంకరమఠంలో శంకరశాస్త్రి పురాణ శ్రవణం చేస్తున్న భక్తులు అలలు అలలుగా లేచి నిలబడసాగారు. "భక్తులారా! మరికొంతసేపు ఓపిక పట్టండి. గంగావతరణం పూర్తి కావచ్చింది. భగీరధుని సంకల్పాన్నీ, కార్యదీక్షనూ మరొకసారి గుర్తుచేసుకొని, మరో పది నిముషాలు కూర్చోండి. ఆసాంతం పురాణం వినని దోషం మీకూ, పురాణ పఠనం పూర్తి చెయ్యని పాపం నాకూ అంటకుండా ఉండాలంటే..." మైకులో విన్పిస్తున్న శాస్త్రి కంఠం- "పానీ ఆ రహా! పానీ ఆ రహా! భాగో! భాగో!" అని అరుస్తూ పరుగులు తీస్తున్న జనం రొదలో కలిసిపోయింది. శాస్త్రికి ఎదురుగా ఉన్న జనసమూహం ఉప్పెనలా శంకరమఠం గోడలమీదినుంచి పొంగింది. గేటు దగ్గర తొక్కిసలాట. ఆడ-మగా తేడా లేదు. చిన్నా-పెద్దా తారతమ్యం లేదు. ఉన్నది ఒక్కటే, అది ప్రాణ భయం. మనిషిమీదనుంచి మనిషి నడిచిపోతున్నాడు. జారిన పైటలు-పరుగులు తీస్తున్న పంచలు-పిల్లల ఏడ్పులు-ఆడవాళ్ళ ఆర్తనాదాలు-పెద్దవాళ్ళ హాహాకారాలు! శాస్త్రి చెవులు చిల్లులు పడ్తున్నాయి. శాస్త్రికి తల తిరిగినట్టయ్యింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కాళ్ళు పట్టు తప్పుతున్నాయి. యాంత్రికంగా లేచి నిలబడ్డాడు. ఆశ్చర్యం! తనకే తెలియదు తనెప్పుడు నిలబడ్డాడో! ఏమిటీ ప్రళయం? ఏమిటీ ఉత్పాతం? ఇది తన పురాణ మహిమా? నిజంగా గంగామాత ఆకాశంనుంచి భూమి మీదకు దుముకుతోందా? అప్రయత్నంగానే శాస్త్రి తలపైకెత్తి చూశాడు. ఆకాశం నిర్మలంగా కన్పించింది. అక్కడక్కడ మబ్బులు కమ్ముతున్నట్టున్నాయి.