
VOL 4-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM - NAVALALU - ADAVI MALLE
₹200
In stock · 92 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అడవిమల్లె వీధి దీపాలు వెలిగాయి. అయినా ఆ యింటి ముంగిలి చీకటిగానే ఉంది. కృష్ణారావు ఇంటి ముందున్న మొక్కల దగ్గరనుంచి వరండాలోకి వచ్చాడు. సోఫాలో కూర్చుని నిట్టూర్పు విడిచాడు. "వరండాలో లైటన్నా వేయలేదేం?" వంట గదిలో నుంచి బయటికి వచ్చిన కాంతమ్మ అన్నది. భార్యమాట వినిపించుకోనట్లే లేచి కృష్ణారావు గేటుదగ్గరకొచ్చాడు. వీధిలో కేసి కాసేపు చూసి మళ్ళీ లోపలికి వచ్చాడు. వరండాలో లైటు వెలిగించి సోఫాలో జారగిలపడుతూన్న భర్తనుచూసి కాంతమ్మ అన్నది: "ఎందుకూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ బయటకూ తిరుగుతారు? ఇప్పుడేం కొంపలు మునిగిపోయినై?" "నీ కలాగే ఉంటుందే? అదే నీ కడుపున పుట్టిన బిడ్డయితే ఇలా ప్రవర్తిస్తావా?" అన్నాడు కృష్మారావు. "బాగానే ఉంది సంబడం! నన్నంటారేం? తమ్ముడి మీద అంత ప్రేమ కారిపోయేవాడివి వెళ్ళలేకపోయావూ?" అంటూ రుసరుసలాడుతూ కాంతమ్మ లోపలికి వెళ్ళింది. అవును! తను వెళ్ళి వుండాల్సింది. స్కూల్లో 'పేరేంట్సు డే' అనీ అందరి పిల్లల తల్లిదండ్రులు వస్తారనీ, తననూ, వదిన్నీ తప్పక రమ్మని చంద్రం మరీమరీ చెప్పి వెళ్ళాడు. కృష్ణారావుకు ఆనాడు తల్లి అన్న మాటలు జ్ఞాపకం వచ్చి, ఎక్కడో గుండెల్లో కలుక్కుమన్నట్లయింది. “ఇక తల్లివైనా తండ్రివైనా నీవే చంద్రానికి” అంటూ తల్లి పార్వతమ్మ, తమ్ముణ్ణి తనచేతిలో పెడుతూ ప్రాణాలు వదిలింది. "మామయ్యా! మా టీచర్లంతా చంద్రాన్ని ఎంత పొగిడారనుకున్నావ్! అన్నిట్లోనూ ప్రథమ బహుమతి చంద్రానికే. ముఖ్యంగా చంద్రం తను రాసిన కవిత్వం చదివితే వచ్చిన అతిథులంతా ఎంత అనందించారనుకున్నావ్ మావయ్యా! అందరూ ఎవరబ్బాయి అంటే ఎవరబ్బాయి అని అడిగేవాళ్ళే!" చంద్రానికి లభించిన బహుమతుల్లో సగం మోసుకుని వచ్చిన పక్కింటి ప్రసాదరావుగారి అమ్మాయి హేమ గబ గబా గుక్క తిప్పుకోకుండా చెప్పసాగింది. కృష్ణారావుకు ఆనందం, విచారం రెండూ ఒకదాన్నొకటి త్రోసుకువచ్చాయి. తలెత్తి తమ్ముడివైపు చూశాడు. చంద్రం తన చేతిలో ఉన్న పాకెట్లను టేబులుమీద పెడుతున్నాడు. అతని వదనంలో ఎంత దాచాలనుకున్నా దాగని విషాదచ్ఛాయలు కనిపిస్తున్నాయి.