VOL 4-KRISHNA SASTRY SAHITYAM-GEYALU-AMRUTAVEENA by DEVULAPALLI KRISHNA SASTRY Telugu book cover

VOL 4-KRISHNA SASTRY SAHITYAM-GEYALU-AMRUTAVEENA

by DEVULAPALLI KRISHNA SASTRY

₹160
In stock · 361 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
దేవులపల్లి కృష్ణశాస్త్రి 1-11-1897 24-2-1980 'కలికి పాటల కోయిల కులం'లో పుట్టిన కృష్ణశాస్త్రి "నేను హృదయవాదిని. నాకు వేదాంతం, తర్కం తలకెక్కవు. నన్ను ఎడారిలో కూర్చోబెట్టి వేయి పుస్తకాలు ఇస్తానన్నా వద్దు ఒక్క పుస్తకమూ అక్కరలేదు. పనికిమాలిన వారు, చెడ్డవారు, వికారరూపులూ అయినా సరే, జనం మధ్యన నన్ను పడేయండి" అంటారు. రొమాంటిక్ ఉద్యమ ప్రవాహంలో పడ్డ వీరు సంప్రదాయానికి సమకాలిక జీవితం మేళవించారు. ప్రతి పదానికీ రంగూ, రుచీ, వాసనా ఉంటాయన్న నమ్మకం వీరిది. నిజాయితీ, మానవత్వాల కలయికే కవి జీవితం అన్నది వీరి భావన. 'పుట్టలోని పాములాగ, తెల్లవారి తలుపులు తట్టి వచ్చిపడే అతిథిలాగ, రేకులు విచ్చుతున్న పువ్వులాగ' తనకు కవిత్వం వస్తుందంటారు కృష్ణశాస్త్రి గారు. వ్యక్తిత్వం వక్తృత్వం, గానకౌశలం కలపోసి మూర్తీభవిస్తే కృష్ణశాస్త్రి గారు. ఆధునిక యుగంలో బయలుదేరిన ఉద్యమాలలో మానవోద్యమానికి మనసా వాచా అంకితమైన వ్యక్తి. వచనంలోనూ కవిత్వం ఉంటుందా ? అన్నవారు కృష్ణశాస్త్రి గారితో మాట్లాడితే తెలిసొచ్చేది ఆ అవకాశం లేనివాళ్ళకు వీరి గద్యమే శరణ్యం. ప్రతి పదాన్నీ చిత్రిక పట్టడంలో జేమ్స్ జాయిస్ కు, కొత్తచూపు సంతరించుకోటంలో రఘుపతి వెంకటరత్నం నాయుడుకూ' వారసులు వీరు. భావకవిత్వపు ప్రయోక్తా, ప్రచారకుడూ, కృష్ణపక్షానికి వెలుగులరేడు. తెలుగుదనానికి సూటిదనాన్నీ, సాహిత్యం కమ్మదనాన్నీ కలగలిపి చిత్రసీమను సేవించిన స్వరార్చకుడు. దేవుని ఉనికి పట్ల ఉపేక్ష వహిస్తూనే నిరాకారుణ్ణి భజించిన భక్తకవి. దేవంలో మతం పేరిట జరిగే దారుణ మారణకాండను 'మతం వద్దు గీతం వద్ద' మారణ హోమం వద్దు' అంటూ ఎలుగెత్తి జాతి, మతాల సమైక్యతను చాటిన లౌకికవాది. "ఆకాశము నొసట పాడుచు అరుణారుణ తార" అంటూ ఆగామికాలాన్ని ఊహించిన ఆశావాది. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలనూ 'శాస్త్రీ'య ముద్రతో సుసంపన్నం చేస్తూ పలుగ్రంథాలు రాసిన రసవాది. 1964 నుండి మూగవోయిన గొంతుతో మౌనరాగాలు ఆలపించిన 'వాగ్గేయకారుడు'. స్వేచ్ఛా సమనత్వాల బావుటాలెత్తిపట్టిన కాల్పనిక కవిత్వంతో ప్రారంభించి, ప్రగతిశీల సాహిత్యపు తాత్వికతను ఆహ్వానించి, కొన్ని దశాబ్దాల పాటు తెలుగు కవిత్వం వడినీ, కవుల నడవడినీ ప్రభావితం చేసిన కులగురువు. అధ్యాపకుడుగా జీవితాన్ని అరంభించి, నిత్యాధ్యయన శీలిగా, కవిత్వ పథ నిర్దేశకుడుగా జీవితాంతం నిలిచాడు. కళాప్రపూర్ణ, పద్మభూషణ్ వంటి బిరుదులకు కృష్ణశాస్త్రి లభించటంతో వాటికే వన్నెవచ్చింది. వారికి లభించిన సన్మాన సత్కారాలకే ఖ్యాతి దక్కింది. " ఆ తరం కవులు అందరూ ఒక ఎత్తు. కృష్ణశాస్త్రి గారొక ఎత్తు. వారిలో కృష్ణశాస్త్రి గారే కొంచెం ఎత్తు" అన్న కొలమానం వీరి జౌన్నత్యానికి నార్ల సాక్షి సంతకం. "తెలుగు దేశపు నిలువుటద్దం బ్రద్దలైంది. షెల్లీ మళ్ళీ మరణించాడు. వసంతం వాడిపోయింది" అన్న శ్రీశ్రీ స్మృత్యంజలి తెలుగు కవిత్వ చరిత్రలో కృష్ణశాస్త్రిగారి నిలువెత్తు సంతకం. “ మనకు ఒక్కటే తాజ్మహల్ ఉన్నది. మనకు ఒక్కడే కృష్ణశాస్త్రి ఉన్నాడు“ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.