
VOL 6-DR.VASIREDDY SEETHA/DEVI SAHITHYAM-TONIKINA SWAPNAM - MALLI TELLARINDI
₹150
In stock · 102 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తొణికిన స్వప్నం చీకటి! చుట్టూ చీకటి! కటిక చీకటి! తనకేదో భయంగా వుంది. ఎవరు వాళ్ళు? ఎంత నల్లగా చీకటి నీడల్లా వున్నారు? వాళ్ళు తనను ఎక్కడకు తీసుకుపోతున్నారు? కాదు, బలవంతంగా ఈడ్చుకుపోతున్నారు. తను వాళ్ళకేం అపకారం చేసింది? అబ్బ! భయంకరంగా వున్నారు వాళ్లు? ఎంత తనను ఎవరు రక్షిస్తారు? “నన్నెందుకు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి... ఎక్కడికి... ఎందుకు?" తను అరుస్తోందా? మరి ఎవరూ రారేం తనను రక్షించడానికి? అసలు తను ఎక్కడ వుంది? ఈ చీకటి గుహలోకి ఎలా, ఎప్పుడు ప్రవేశించింది? అరే! తమాషాగా వుందే? ఇంతలోనే చీకటి తెరలు ఎలా జారిపోయాయి? ఈ వెలుగేమిటి? ఎంత వెలుగు! ఇలాంటి వెలుగును తను ముందెన్నడూ చూళ్లేదే? తన శరీరం ఏమిటిలా తేలిగ్గా అయిపోతుంది? ఎంత హాయిగా ఆకాశంలో ఎగిరిపోతున్న పక్షిలా తను పైకి తేలిగ్గా తేలిపోతుందేం? తను పక్షిలా మారిపోతుందా? అంతే అయివుండాలి. లేకపోతే, తను ఎలా ఇంత తేలిగ్గా, ఏ ఆధారం లేకుండా ఎగర గలుగుతోంది? తనకు రెక్కలు లేవుగా? ఇదేమిటి, మళ్ళీ తన శరీరం బరువెక్కిపోతుందేం? తను కిందకు పడిపోతూంది. రెక్కలు తెగిన పక్షిలా గిరగిరా తిరుగుతూ పడిపోతూంది. తనను ఎవరో బలవంతంగా కిందకు తోసేస్తున్నారు. ఎవరు వాళ్లు? ఆ చీకటి మనుషులే! మళ్ళీ చీకటి కమ్మేస్తోంది. ఆ వెలుగేమయింది? తను పడిపోతుంది. పడిపోయింది. భయంతో అరవాలనుకుంటూంది. కాని, గొంతు పెగలలేదు. పడిపోయింది. అంతులేని అగాధంలోకి పడిపోయింది. కాని, దెబ్బలు తగల్లేదు! ఆశ్చర్యంగా వుంది. ఎవరో గుసగుసలాడుతున్నారు. కాదు, నూతిలో మాట్లాడుతున్నారు. ఆ నూతిలో గొంతుకలు ఎవరివి? ఆ చీకటి మనుషులివి కాదు కదా? మాటలు దగ్గరగా విన్పిస్తున్నాయి. తన దగ్గరగా నిల్చునే ఎవరో మాట్లాడుతున్నారు. అస్పష్టంగా వున్నాయి ఆ మాటలు.