
VOL 9-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM-MAREECHIKA-160
₹160
In stock · 25 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మరీచిక శబరికి ఏదో చెయ్యాలని ఉంది. ఏదో అద్భుతం జరగాలని ఉంది. ఏదైనా సాహసం చెయ్యాలని ఉంది. ఈ మధ్య ఎప్పుడూ ఏదో చెయ్యాలని అనిపిస్తూ ఉంటున్నది. కాని ఏం చెయ్యాలో తెలియడం లేదు. కనీసం ఏదైనా సమస్యను యెదుర్కొవాలని వున్నది. బాధపడాలని వుంది, ఆ బాధలోనే థ్రిల్ అనుభవించాలని ఉంది. ఏదో కొత్తదనం, రొటీన్కు భిన్నమైనది జరగాలని ఆమె మనసునిత్యం ఆరాటపడుతూ ఉంటున్నది. శబరి సంపన్నుడైన రంగారావు ఏకైకపుత్రిక ఊహ తెలిసినప్పటినుంచీ ఏది కోరినా నిముషాలమీద లభిస్తూనే ఉన్నది. ఆ ఇల్లు ఆమెకు బంగారు పంజరంలా అనిపిస్తూ ఉన్నది. తన చుట్టూ వున్న మనుషులు యంత్రాల్లా కన్పిస్తున్నారు. వారి మాటలూ, చేతలూ, మహాబోర్ కొట్టేస్తున్నాయి. ఆమెకు ఏం కావాలో తెలియడం లేదు! ఏది అక్కర్లేదో మాత్రమే తెలుస్తున్నది! శబరి అద్దంముందు కెళ్ళి నిల్చున్నది. గిరిజాల జుట్టు, ఒకప్పుడు తను ఎంతో ఇష్టంగా చూసుకొని మురిసిపోయే ఆ జుట్టు, చిరాకు కలిగిస్తూ వున్నది. ఎంతో మోజుపడి కుట్టించుకున్న జీన్స్లో తనను చూసుకున్నది. బాగాలేదనిపించింది. వెంటనే దుస్తులు మార్చుకున్నది. ప్యాంటు షర్టూ వేసుకున్నది. మళ్ళీ అద్దంలో చూసుకున్నది. అది రొటీన్గా విసుగ్గానే అనిపించింది. బీరువా తెరిచింది రకరకాల చీరెలు ఒక్కొక్కటే తీసి పడేసింది. ఏదీ కట్టుకోవాలనిపించలేదు. చీరలన్నీ అడ్డదిడ్డంగా మళ్ళీ బీరువాలో అరల్లో కుక్కింది. కిటికీ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఎదురుగా వున్న పూరి గుడిసెలకేసి చూసింది. ఆ గుడిసెల్లోకి వెళ్ళి కూర్చోవాలనిపించింది. ఎదురుగా రాములమ్మ కన్పించింది. ముతక నేతచీర మోకాళ్ళపైకి మడిచి గోచీ పెట్టుకొని కట్టుకున్నది రాములమ్మ. గాబుపైగా వంగి కుడితిని కుడిచేత్తో కలుపుతూ గేదెకు తాగిస్తూ వున్నది. రాములమ్మ చీర బలే వుంది! తను కూడా అలా కట్టుకుంటే? తన దగ్గిర అలాంటి చీర లేదుగా? అమ్మ అలాంటి చీర తనను కట్టుకోనిస్తుందా? అలాంటి చీర, ఆ రాములమ్మలాగే కట్టుకొని డిన్నర్కి వెళ్తే? బలేగా వుంటుంది. కాని అందరూ తనకు పిచ్చెక్కింది అనుకుంటారు. కళ్ళు తేలవేసిచూస్తారు. వాళ్ళు అలా చూస్తుంటే బలే థ్రిల్గా వుంటుందిలే! కాని... ఎలా కట్టుకోవడం? మమ్మీ ఒప్పుకోదు? డాడీ కూడా ఇప్పుకోడు. డా॥ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం-9 • 1